Sai pallavi: మూవీ రివ్యూ : 'గార్గి'

Gargi movie review

  • ఈ రోజునే విడుదలైన 'గార్గి'
  • సహజత్వం .. సాగతీత కలిసిన కథ
  • కమర్షియల్ అంశాలను పట్టించుకోని దర్శకుడు 
  • అవకాశం ఉన్నప్పటికీ ఆసక్తిని రేకెత్తించని స్క్రీన్ ప్లే 
  • సాయిపల్లవి నటన హైలైట్

చాలా తక్కువ సమయంలోనే నాయిక ప్రధానమైన కథలను చేసే స్థాయికి సాయిపల్లవి చేరుకుంది. ఇంతవరకూ ఆమె చేసిన సినిమాల సంఖ్య చాలా తక్కువనే. కానీ ఆమెకి వచ్చిన క్రేజ్ చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. బరువైన పాత్రలను పోషించడంలో సాయిపల్లవి తరువాతనే ఎవరైనా అని నమ్మకంగా చెప్పుకునే స్థాయికి ఆమె ఎదిగింది. అందుకు నిదర్శనంగా నిలిచిన సినిమానే 'గార్గి'.

తమిళంలో నిర్మితమైన ఈ సినిమాకి గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించాడు. కాళీ వెంకట్ .. ఐశ్వర్య లక్ష్మి .. శరవణన్ .. శివాజీ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి గోవింద్ వసంత సంగీతాన్ని అందించాడు. తమిళంతో పాటు తెలుగు .. కన్నడ భాషల్లోను ఈ రోజునే ఈ సినిమా థియేటర్లకు వచ్చింది. తమిళంలో సూర్య సమర్పించిన ఈ సినిమాను, తెలుగులో రానా సమర్పించాడు. లీగల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుందో చూద్దాం.

'గార్గి' (సాయిపల్లవి) ఒక స్కూల్లో టీచర్ గా పనిచేస్తూ ఉంటుంది. ఆమె తండ్రి బ్రహ్మానందం (శివాజీ) ఓ అపార్టుమెంటులో వాచ్ మెన్ గా పనిచేస్తూ ఉంటాడు. తల్లి ఇంటి దగ్గరే పిండి ఆడిస్తూ ఉంటుంది. చెల్లెలు చదువుకుంటూ ఉంటుంది. అలా చాలీచాలని సంపాదనతో ఆ కుటుంబం గడుస్తూ ఉంటుంది. బాలాజీ అనే యువకుడిని ప్రేమించిన 'గార్గి' అతనిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. అందుకు  సంబంధించిన సన్నాహాలు మొదలుపెట్టాలని అనుకుంటూ ఉండగా,  ఓ అనూహ్యమైన సంఘటన జరుగుతుంది. 

శివాజీ పనిచేస్తున్న అపార్టుమెంటులో ఓ తొమ్మిదేళ్ల అమ్మాయిపై సామూహిక అత్యాచారం జరుగుతుంది. అందులో తన తండ్రి పేరు ఉండటం చూసి గార్గి ఉలిక్కి పడుతుంది. తన తండ్రి ఆ నేరం చేసి ఉండడని భావించిన 'గార్గి' ఆయనను కాపాడుకోవడానికి తనవంతు ప్రయత్నాలు చేయడం మొదలుపెడుతుంది. 

ఈ కేసు విషయంలో లాయర్ భానుప్రకాశ్ ను ఆమె నమ్ముకుంటే, ఆయన కూడా చేతులెత్తేస్తాడు. అప్పుడు ఆయన దగ్గర అసిస్టెంట్ గా ఉన్న గిరీశం( కాళీ వెంకట్) ముందుకు వస్తాడు. సరైన ఆధారాలను సంపాదించి తన తండ్రిని నిర్దోషిగా బయటికి తీసుకుని రావడానికి 'గార్గి' ఏం చేస్తుంది? ఆ ప్రయత్నంలో ఆమెకి తెలిసే నిజాలేంటి? అనేదే కథ.

దర్శకుడు గౌతమ్ రామచంద్రన్ రాసుకున్న కథ ఇది. చాలా తక్కువ బడ్జెట్ లో .. పరిమితమైన పాత్రలతో తెరకెక్కించిన సినిమా ఇది. ఒక రేప్ కేసులో అరెస్టు అయిన తన తండ్రిని, నిర్దోషిగా బయటికి తీసుకురావడానికి తన శక్తికి మించి పోరాడిన ఒక కూతురు కథ ఇది. సాయిపల్లవిని టీచర్ గా పరిచయం చేస్తూ కథ చాలా ప్రశాంతంగా మొదలవుతుంది. ఆ తరువాత కథ ముదురుతూ పాకాన పడుతుంది. 

సమాజంలో ఒక ఇంటి నుంచి ఒక నేరస్థుడు బయటికి వస్తే, ఇక మిగిలి కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుందనేది దర్శకుడు బాగా చూపించాడు. ఆర్థికపరమైన బలం .. పెద్దల అండదండలు లేనివారు ఏదైనా కేసులో స్టేషన్ కి వెళితే పరిస్థితి ఎలా ఉంటుందనేది కూడా కళ్లకు కట్టాడు. నిస్సహాయుడైన తన తండ్రిని కాపాడుకోవడం కోసం  .. మిగతా కుటుంబ సభ్యులను నిలబెట్టడం కోసం ఒక కూతురుపడే ఆవేదనతో ఆశించిన స్థాయి ఎమోషన్ ను దర్శకుడు రాబట్టాడు.

నిజానికి ఇది చాలా ఇంట్రెస్టింగ్ లైన్ .. అత్యాచారం కేసులో ఒక వ్యక్తి దోషి అని సమాజం అంతా నమ్ముతోంది. కానీ తన తండ్రి నిర్దోషి అంటూ నిరూపించడానికి ఒక కూతురు రంగంలోకి దిగుతుంది. తాను అనుకున్నది సాధించడానికి ఆమె చేసే ప్రయత్నాలు  .. ఆ ప్రయత్నాల్లో ఆమెకి ఎదురయ్యే అనుభవాలు ..  ఎప్పటికప్పుడు మారిపోతున్న పరిస్థితులు ఉత్కంఠను రేకెత్తించాలి. గార్గి నెక్స్ట్ ఏం చేయబోతోంది? ఆమె వేసే స్టెప్ వలన ఏం జరగబోతోంది? అనేది ఉత్కంఠభరితంగా ఉండాలి. కానీ ఈ విషయంలో దర్శకుడు విఫలమయ్యాడు.

కథలో మంచి పాయింట్ ఉంది .. తెరపై దానిని ఆసక్తికరంగా ఆవిష్కరించే అవకాశం ఉంది. కానీ దర్శకుడు ఆ దిశగా కసరత్తు చేయలేకపోయాడు. అడుగడుగునా ఆసక్తిని రేకెత్తించే కథను సాదాసీదాగా నడిపించుకుంటూ వెళ్లాడు. సహజత్వానికి దగ్గరగానే ఉన్నా .. సాగదీసుకుంటూ వెళ్లాడు. ఐశ్వర్య లక్ష్మీ .. శరవణన్ పాత్రలను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు. సన్నివేశాలు సహజంగానే అనిపిస్తాయి ..  ఎక్కడో క్లైమాక్స్ లో ఒక ట్విస్టు ఉంటుంది. కానీ అవి ఒక సినిమాను నిలబెట్టేంత .. ఒక ప్రేక్షకుడిని కూర్చోబెట్టేంత స్థాయిలో ఉండవు. దర్శకుడు మిగతా హంగులను అమర్చుకోలేకపోయాడు. 

ఈ కథను సాయిపల్లవి ఎలా అంగీకరించింది? అని మాత్రం అనిపించదు. ఎందుకంటే ఆమెకి తగిన కథనే .. ఆమె చేయదగిన పాత్రనే. అయితే అవకాశం ఉన్నప్పటికీ కమర్షియల్ అంశాలను జోడించడంపై దర్శకుడు దృష్టిపెట్టకపోవడమే లోపంగా కనిపిస్తుంది. ఆ అంశాలను సరిచేసుకుని వస్తే మరో 'దృశ్యం' మాదిరి సినిమాగా నిలబడిపోయేది. సాయిపల్లవి నటనకు ఆవగింజంత వంక కూడా పెట్టలేం. కీలకమైన సమయంలో లాయర్  భాను ప్రకాశ్ చేతులెత్తేసినప్పుడు. 'నాకు అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు సార్' అనే సాయిపల్లవి ఎక్స్ ప్రెషన్ ఒక్కటి .. ఈ సినిమా మొత్తానికి చాలు అనిపిస్తుంది. మిగతా నటీనటులంతా చాలా సహజంగా చేశారు. గోవింద్ వసంత బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు కెమెరా పనితనం .. ఎడిటింగ్ అన్నీ బాగానే ఉన్నాయి.

--- పెద్దింటి గోపీకృష్ణ

  • Loading...

More Telugu News