- ఆగస్ట్ నుంచి ఆఫ్ సీజన్ కావడంతో జాగ్రత్తలు
- మార్క్ ఫెడ్ ద్వారా 2,50,000 టన్నుల సమీకరణ
- ధరల అదుపు కోసం అవసరమైతే మార్కెట్లోకి విడుదల
ఉల్లి దెబ్బకు ప్రభుత్వాలు మారిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. గతంలో ఢిల్లీ ఎన్నికల సమయంలో పెరిగిన ధరలు ప్రభుత్వ మార్పునకు దారితీసిన విషయం గుర్తుండే ఉంటుంది. దీంతో గత అనుభవాలు నేర్పిన పాఠంతో.. కేంద్ర ప్రభుత్వం రానున్న ఉల్లి ఆఫ్ సీజన్ లో ధరలు మండిపోకుండా ముందు నుంచే జాగ్రత్త చర్యలు చేపడుతోంది. సాధారణంగా ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు ఉల్లి దిగుబడి పెద్దగా ఉండదు. ఈ కాలంలోనే ఉల్లిపాయల ధరలు భగ్గున మండుతుంటాయి.
అందుకని కేంద్ర సర్కారు రూ.2,50,000 టన్నుల ఉ్లలిని మార్కెట్ నుంచి సమీకరించి స్టోర్ చేసింది. ధరల స్థిరీకరణ నిధి కింద ఈ ఉల్లిని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కొనుగోలు చేసి నిల్వ చేసింది. సరఫరా తగ్గి, రేట్లు పెరిగినప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకుని, ఈ నిల్వలను మార్కెట్లోకి విడుదల చేస్తుంది. తద్వారా ధరలను అదుపు చేయవచ్చన్నది కేంద్రం యోచన. ఇప్పటికే ద్రవ్యోల్బణం 7 శాతంపైకి చేరడం తెలిసిందే.
గత శీతాకాలంలో సాగు చేసిన పంట రూపంలో దిగుబడులు రాగా.. మార్క్ ఫెడ్ ద్వారా కేంద్రం కొనుగోలు చేయించింది. ఉల్లి ఎక్కువగా సాగయ్యే మహారాష్ట్ర, గుజరాత్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఉల్లిపాయలను కొనుగోలు చేసింది. గతంలో రూ.100కు పైగా పెరిగిపోయిన ఉల్లి ధరలు.. ప్రస్తుతం కిలోకు రూ.25-35 స్థాయిలో ఉన్నాయి.