Virat Kohli: ఫామ్ లో లేని కోహ్లీ... ఊహించని వ్యక్తి నుంచి మద్దతు

Pakistan captain Babar Azam supports Virat Kohli

  • పేలవ ఫామ్ తో కోహ్లీ సతమతం
  • ధైర్యంగా ఉండు అంటూ బాబర్ అజామ్ ట్వీట్
  • ప్రతి ఆటగాడికి ఇలాంటి పరిస్థితి తప్పదని వ్యాఖ్య 
  • థ్యాంక్యూ అంటూ స్పందించిన కోహ్లీ

గతంలో తన డైనమిక్ ఆటతీరుతో, దూకుడుతో నిత్యం వార్తల్లో నిలిచిన టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ఇప్పుడు పేలవ ఫామ్, దారుణ వైఫల్యాల కారణంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాడు. 2019 నుంచి కోహ్లీ బ్యాట్ నుంచి ఒక్క సెంచరీ కూడా రాలేదు సరికదా, ఆటతీరు నానాటికీ తీసికట్టు... అన్నట్టుగా మారింది. 

ఒక్క ఇన్నింగ్స్ తో కోహ్లీ గాడినపడతాడని రోహిత్ శర్మ వంటి సహచరులు ధీమా వ్యక్తం చేస్తున్నా, ఆ ఇన్నింగ్స్ ఇంతవరకు సాకారం కాలేదు. దాంతో, కోహ్లీ భవితవ్యంపై తీవ్ర అనిశ్చితి నెలకొంది. క్రికెట్ పండితులు, మాజీ క్రికెటర్లు కోహ్లీపై విమర్శనాస్త్రాలు సంధించడం ఎక్కువైంది. 

ఈ నేపథ్యంలో, ఏమాత్రం ఊహించని వ్యక్తి నుంచి కోహ్లీకి మద్దతు లభించింది. పాకిస్థాన్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ కోహ్లీని ఉద్దేశిస్తూ తాజాగా చేసిన ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. "ఈ కష్టకాలం కూడా తొలగిపోతుంది... ధైర్యంగా ఉండు" అంటూ బాబర్ అజామ్ ట్వీట్ చేశాడు. దీనిపై కోహ్లీ స్పందించాడు. "థాంక్యూ" అంటూ ట్వీట్ చేశాడు. "నువ్వు మరింత ఉజ్వలంగా ఎదగాలి... నీకంతా మంచి జరగాలి" అని కోరుకుంటున్నట్టు కోహ్లీ పేర్కొన్నాడు. 

కాగా, శ్రీలంకతో నేడు గాలేలో తొలి టెస్టు ప్రారంభం సందర్భంగా బాబర్ అజామ్ మీడియాతో మాట్లాడుతూ కోహ్లీకి బాసటగా ట్వీట్ చేయడంపై వివరణ ఇచ్చాడు. 

"నేను కూడా ఆటగాడ్నే కాబట్టి ఫామ్ లో లేకపోవడం ఏదో ఒక దశలో ప్రతి ఆటగాడికి అనుభవంలోకి వస్తుందని తెలుసు. ఇలాంటి దశలో ఒక ఆటగాడి మానసిక స్థితి ఎలా ఉంటుందో కూడా నాకు తెలుసు. ఈ సమయంలో కావాల్సింది మద్దతు. అందుకే నావంతుగా కోహ్లీకి మద్దతు ఇస్తూ ట్వీట్ చేశాను. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో కోహ్లీ ఒకడు. కోహ్లీ ఎంతో క్రికెట్ ఆడాడు. గడ్డుకాలం నుంచి బయటపడడం ఎలాగో అతడికి తెలుసు. అయితే కొంచెం సమయం పట్టొచ్చు" అంటూ బాబర్ అజామ్ పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News