Hyderabad: భాగ్యనగరిలో బోనాలు షురూ... అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన తలసాని, రేవంత్
- తెల్లవారుజామున తొలి బోనాన్ని సమర్పించిన మంత్రి తలసాని
- నగరంలోని నలుమూలల నుంచి పోటెత్తిన భక్తజనం
- రేవంత్ రెడ్డి రాక సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత
హైదరాబాద్లో బోనాల జాతర ఆదివారం తెల్లవారుజామున కోలాహల వాతావరణం మధ్య మొదలైంది. సికింద్రాబాద్ పరిధిలోని శ్రీ ఉజ్జయినీ మహాకాళి ఆలయంలో అమ్మవారికి ఆషాడ మాస తొలి బోనాన్ని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తెల్లవారుజామున 5.30 గంటలకే సమర్పించారు. ఈ బోనంతోనే అధికారికంగా బోనాల జాతర ప్రారంభమైంది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి పోటెత్తారు.
ఇదిలా ఉంటే.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆలయానికి వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బారీకేడ్లను తోసుకుంటూ ఆయన ఆలయం లోపలకు ప్రవేశించారు. ఈ క్రమంలో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకోగా... పోలీసు ఉన్నతాధికారుల సూచనలతో పరిస్థితి సద్దుమణిగింది. అనంతరం ఆలయం లోపలకు వెళ్లిన రేవంత్ రెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.