Telangana: అనుకూలించిన వాతావరణం...కేసీఆర్ ఏరియల్ సర్వే ప్రారంభం
- వరంగల్ నుంచి రోడ్డు మార్గం మీదుగా భద్రాచలానికి కేసీఆర్
- మధ్యాహ్నానికి అనుకూలించిన వాతావరణం
- హెలికాప్టర్‌లో ఏటూరునాగారం పరిశీలనకు వెళ్లిన కేసీఆర్
గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని గోదావరి పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. తెలంగాణలో వరద ప్రాంతాల పరిశీలన కోసం బయలుదేరిన కేసీఆర్‌కు ఆదివారం వాతావరణ పరిస్థితులు అనుకూలించలేదు. ఫలితంగా ఆయన వరంగల్ నుంచి రోడ్డు మార్గం మీదుగా భద్రాచలానికి వెళ్లారు. అక్కడ గోదావరి నదికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడిన కేసీఆర్ ఏటూరు నాగారం పరిశీలనకు బయలుదేరారు.
అయితే ఆదివారం మధ్యాహ్నం సమయంలో వాతావరణం అనుకూలించడంతో హెలికాప్టర్ ఎక్కిన కేసీఆర్ వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే ప్రారంభించారు. తొలుత ఏటూరు నాగారం ప్రాంతాన్ని పరిశీలించనున్న కేసీఆర్... గోదావరి పరివాహక ప్రాంతంలో నీట మునిగిన ప్రాంతాలను కూడా పరిశీలించనున్నారు. వరద ప్రాంతాల పరిశీలన కోసం శనివారం రాత్రే వరంగల్ చేరుకున్న కేసీఆర్ రాత్రి అక్కడే బస చేసిన సంగతి తెలిసిందే.