Andhra Pradesh: కాస్త శాంతించిన గోదావరి.. ఇంకా ముంపులోనే లంక గ్రామాలు
- ధవళేశ్వరం వద్ద నదిలో తగ్గిన ప్రవాహం
- ఇంకా నీటిలోనే మునిగి ఉన్న విలీన మండలాలు
- కోనసీమలో ఏటిగట్ల పైనుంచి ప్రవహిస్తున్న గోదావరి నది.. ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
ఎగువ నుంచి గోదావరి వరద తగ్గుముఖం పట్టడంతో ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ప్రవాహం కాస్త తగ్గింది. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 21 అడుగులకుపైగా వరద కొనసాగుతుండగా.. 25 లక్షల క్యూసెక్కులకుపైగా సముద్రంలోకి వెళ్లిపోతోంది. వరుణుడు శాంతించి వానలు దాదాపుగా నిలిచిపోవడంతో వారం రోజుల తర్వాత గోదావరి నదిలో ప్రవాహం నియంత్రణలోకి వస్తోంది. అయితే ఏపీ పరిధిలోని గోదావరి లంక గ్రామాలు మాత్రం ఇంకా ముంపులోనే ఉన్నాయి. ఎగువ నుంచి ప్రవాహాలు బాగా తగ్గుతున్న నేపథ్యంలో రెండు, మూడు రోజుల్లోనే పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు.
- గోదావరిలో వరద గణనీయంగానే ఉండటంతో విలీన మండలాలైన చింతూరు, కూనవరం, వీఆర్ పురం, ఏటపాక మండలాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. వారం రోజులుగా జల దిగ్బంధంలో ఉండటంతో జన జీవనం స్తంభించింది. పునరావాస కేంద్రాల్లో నీరు, విద్యుత్ లేక ఇబ్బంది పడుతున్నామని బాధితులు వాపోతున్నారు.
- వరద ప్రవాహం కారణంగా పలుచోట్ల ఏటిగట్లు ప్రమాదకరంగా మారాయని.. రాజోలులో ఆరు చోట్ల గట్టు బలహీనమైందని, పైనుంచి వరద ప్రవహిస్తోందని స్థానికులు చెప్తున్నారు. రాజోలు ప్రాంత జనం అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.
గోదావరి నదిలో పోలవరం వద్ద గణనీయంగా ప్రవాహం కొనసాగుతోంది. నీటి మట్టం స్పిల్‌వే వద్ద 36.91 మీటర్లకు చేరగా.. 21 లక్షల క్యూసెక్కులకుపైగా నీటిని వదులుతున్నారు. ఎగువ కాఫర్ డ్యామ్ మునిగిపోయే స్థాయిలో వరద వస్తుందని భావించినా.. ఆ పరిస్థితి లేకపోవడంతో అధికార వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.