Monkey: నాలుగు నెలల పసికందును భవనం పైనుంచి విసిరికొట్టిన కోతి
- ఉత్తరప్రదేశ్ లో ఘటన
- వ్యక్తిని చుట్టుముట్టిన కోతులు
- చేతిలోంచి జారిపోయిన పసిబిడ్డ
- పసిబిడ్డను దొరకబుచ్చుకున్న కోతి
జనావాసాల్లో మనుషుల మధ్యన మనుగడ సాగిస్తుండే కోతుల ఆగడాలు అన్నీఇన్నీ కావు. చాలావరకు తుంటరి పనులు చేసే వానరాలు, కొన్నిసార్లు దుశ్చర్యలకు పాల్పడుతుంటాయి. ఉత్తరప్రదేశ్ లోని బరేలీ గ్రామీణ ప్రాంతంలో ఓ కోతి కారణంగా నాలుగు నెలల పసికందు ప్రాణం కోల్పోవడం అందరినీ కలచివేసింది.
దుంకా గ్రామంలో నివసించే నిర్దేశ్ ఉపాధ్యాయ్ (25) అనే వ్యక్తి శుక్రవారం సాయంత్రం భార్య, తన నాలుగు నెలల కుమారుడితో కలిసి ఇంటి టెర్రస్ పైకి వచ్చాడు. అది మూడంతస్తుల భవనం. వారు సరదాగా టెర్రస్ పై ఉండగా, ఇంతలో పెద్ద సంఖ్యలో కోతులు ఆ భవనం పైకి చేరుకున్నాయి. వాటిని తరిమేందుకు నిర్దేశ్ ప్రయత్నించగా, ఆ కోతలు అతడిని చుట్టుముట్టాయి.
దాంతో మెట్ల వైపు పరిగెత్తేందుకు ప్రయత్నించగా, అతడి చేతిలో ఉన్న పసికందు జారిపోయాడు. తిరిగి ఆ పసిబిడ్డను తీసుకునేంతలో ఓ కోతి ఆ చిన్నారిని దొరకబుచ్చుకుంది. అంతేకాదు, ఆ పసికందును పైనుంచి కిందికి విసిరేసింది. అంతెత్తు నుంచి పడడంతో ఆ పసిబిడ్డ అక్కడిక్కడే మృతి చెందాడు. తమ కన్నబిడ్డ కళ్లెదుటే మరణించడంతో నిర్దేశ్ దంపతులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటనపై అటవీశాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు.