Venkaiah Naidu: గవర్నర్లకు కీలక సూచనలు చేసిన వెంకయ్యనాయుడు!
- రాష్ట్రాలకు దిక్సూచిలా గవర్నర్లు పని చేయాలన్న ఉప రాష్ట్రపతి
- రాష్ట్ర పాలనా వ్యవహారాలు సక్రమంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత గవర్నర్లదేనని వ్యాఖ్య
- యూనివర్శిటీలను ఎక్కువగా సందర్శించాలని సూచన
భారత ఉప రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు పదవీకాలం ముగియబోతోంది. తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఉన్నతమైన పదవులను ఆయన చేపట్టారు. మరోవైపు తన రాజకీయ ప్రస్థానం ముగియనున్న తరుణంలో రాష్ట్రాల గవర్నర్ లకు ఆయన కీలకమైన సూచనలు చేశారు.
గవర్నర్లు రాష్ట్రాలకు ఒక దిక్సూచిలా పని చేయాలని వెంకయ్య అన్నారు. గవర్నర్ పదవి అనేది అలంకారప్రాయమో లేదా రాజకీయ హోదానో కాదని ఆయన చెప్పారు. వివిధ పథకాలకు కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్రాలు సక్రమంగా ఖర్చు చేస్తున్నాయా? లేదా? అనే విషయాన్ని పరిశీలించాల్సిన బాధ్యత గవర్నర్లపై ఉందని సూచించారు. రాష్ట్రాల పాలన వ్యవహారాలు సక్రమంగా కొనసాగేలా చూడాల్సిన బాధ్యత గవర్నర్లదేనని చెప్పారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తమ రాష్ట్రాల్లో ఉన్నటువంటి యూనివర్శిటీలను వీలైనన్ని ఎక్కువ సార్లు గవర్నర్లు సందర్శించాలని వెంకయ్య సూచించారు. యూనివర్శిటీల అధ్యాపకులు, విద్యార్థులతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించాలని చెప్పారు. వివిధ వైద్య, ఆరోగ్య, వ్యాక్సినేషన్, విద్య క్యాంపెయిన్లలో గవర్నర్లు భాగస్వాములు కావాలని అన్నారు. ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సక్రమంగా జరిగితే... అది తనకు మంచి ఫేర్ వెల్ గిఫ్ట్ అవుతుందని వ్యాఖ్యానించారు. ఆగస్ట్ 10న వెంకయ్యనాయుడు పదవీకాలం ముగియనుంది.