Anand Mahindra: ఈ స్టెయిర్ కేస్ అద్భుతం..: ఆనంద్ మహీంద్రా
- సింపుల్ గా, వినూత్నంగా ఉందన్న పారిశ్రామికవేత్త
- స్కాండినేవియన్ డిజైనర్లు అసూయపడేలా ఉందంటూ పోస్ట్
- బయటి గోడకు మంచి అందాన్ని తెచ్చిందన్న ఆనంద్ మహీంద్రా
మేధస్సు ఉండాలే కానీ ఆవిష్కరణలకు కొదవ ఉండదని నిరూపించాడు ఓ సాధారణ వ్యక్తి. వినూత్నమైన ఫోల్డబుల్ మెట్ల మార్గాన్ని తన ఇంటికి ఏర్పాటు చేసుకుని ఔరా అనిపిస్తున్నాడు. పేదల కాలనీల్లో ఒక ఇల్లు 100 గజాల్లోపే ఉంటుంది. అలాంటి చోట ఇంటిపైకి చేరుకోవడానికి మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేసుకునేందుకు జాగా కూడా ఉండదు. అంతేకాదు, గతంలో మెట్లు లేకుండా కట్టిన ఇంటికి సైతం సులభంగా ఈ మెట్లను అమర్చుకుని వెంటనే సునాయాసంగా ఎక్కేయవచ్చు.
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఈ అరుదైన ఫోల్డబుల్ మెట్ల వీడియోను తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. దీనికి అభిమానుల నుంచి అమిత స్పందన వస్తోంది. ‘‘అసాధారణం. చూడ్డానికి చాలా సింపుల్ గా, వినూత్నంగా ఉంది. బయటి గోడకు మంచి అందాన్ని తీసుకొచ్చింది. స్కాండినేవియన్ డిజైనర్లు అసూయ పడేలా ఉంది. ఇదెక్కడిదో నాకు తెలియదు. నా వాట్సాప్ కు వచ్చింది’’ అంటూ ఆనంద్ మహీంద్రా పోస్ట్ పెట్టారు.