Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో ఘోరం.. నర్మదా నదిలో పడిపోయిన బస్సు

Bus falls off bridge into Narmada river in Madhya Pradesh rescue ops on

  • ధార్ జిల్లా సంజయ్ సేతు వారధి వద్ద ప్రమాదం
  • 13 మంది మృతి.. పలువురికి గాయాలు 
  • 15 మందిని కాపాడిన స్థానిక యంత్రాంగం
  • ప్రధాని మోదీ, రాజస్థాన్ సీఎం సంతాపం

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు ధార్ జిల్లాలో వంతెనపై నుంచి నర్మదా నదిలో పడిపోయింది. సోమవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోగా, మిగిలిన వారికి గాయాలయ్యాయి.

కాల్ ఘాట్ సంజయ్ సేతు వారధి బ్యారియర్ ను దాటుకుని 100 అడుగుల లోతులో ఉన్న నదిలోకి బస్సు పడిపోయింది. ఆ సమయంలో బస్సులో 40 మంది ఉన్నట్లు రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ప్రకటించారు. మహారాష్ట్ర రోడ్ వేస్ కు చెందిన బస్సు ఇండోర్ నుంచి పూణెకు వెళుతుండగా, అదుపు తప్పడంతో ఈ ప్రమాదానికి దారితీసింది. ఇప్పటి వరకు 15 మందిని కాపాడారు. 

ప్రమాదం అనంతరం కొన్ని గంటల పాటు శ్రమించి క్రేన్ సాయంతో బస్సును నది నుంచి బయటకు తీశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. రాష్ట్ర విపత్తు దళాన్ని వెళ్లాలంటూ ఆదేశించారు. 

ఈ ప్రమాదం పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘మధ్యప్రదేశ్ లోని ధార్ లో బస్సు ప్రమాదం బాధాకరం. ప్రియమైన వారిని కోల్పోయిన వారి చుట్టూనే నా ఆలోచనలు కదులుతున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. స్థానిక యంత్రాంగం బాధితులకు సహాయం అందిస్తోంది’’ అని పేర్కొన్నారు. రాజస్థాన్ సీఎం గెహ్లాట్ సైతం సంతాపం తెలిపారు.

  • Loading...

More Telugu News