Supreme Court: ఎస్డీఆర్ఎఫ్ నిధులు వెనక్కి ఇచ్చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిన సుప్రీంకోర్టు
- రాష్ట్రంలో కొవిడ్ నిధుల మళ్లింపు
- ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు
- అప్పట్లోనే సీఎస్ కు నోటీసుల జారీ
- సుప్రీం నిర్ణయం సమ్మతమేనన్న ప్రభుత్వ న్యాయవాది
రాష్ట్రంలో కొవిడ్ నిధుల మళ్లింపుపై సుప్రీంకోర్టు గతంలోనే ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. తాజాగా ఈ కేసుకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. పీడీ (పర్సనల్ డిపాజిట్) ఖాతాలకు మళ్లించిన ఎస్డీఆర్ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్) నిధులను వెనక్కి ఇచ్చేయాలంటూ సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అందుకు రెండు వారాల గడువు విధించింది.
సుప్రీంకోర్టు నిర్ణయం పట్ల ఏపీ ప్రభుత్వ న్యాయవాది సమ్మతం తెలిపారు. నిధులు వెనక్కి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. అయితే, ఇంకా కొన్ని కరోనా బాధిత కుటుంబాలకు సాయం అందాల్సి ఉందని ప్రభుత్వ న్యాయవాది సుప్రీం ధర్మాసనానికి విన్నవించుకోగా, ఆ విషయం పరిష్కార కమిటీకి నివేదించాలని స్పష్టం చేసింది.
కరోనాతో మరణించిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు కేటాయించిన సొమ్ములోంచి ఏపీ సర్కారు రూ.1,100 కోట్లు దారిమళ్లించిందంటూ గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అప్పట్లో దీనిపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలంటూ సుప్రీంకోర్టు ఏపీ సీఎస్ కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణలోనూ ఏపీ ప్రభుత్వంపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.