Ghana: మరో కొత్త మహమ్మారి ‘మార్ బర్గ్’ వైరస్.. ఆఫ్రికాలో వ్యాపిస్తున్న ప్రాణాంతక వ్యాధి
- ఇది ఎబోలా తరహాలో అత్యంత ప్రమాదకరమని ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
- సోకిన వారిలో 24 శాతం నుంచి 88 శాతం వరకు మరణించే అవకాశం
- వైరస్ సోకిన జంతువులు, గబ్బిలాల ద్వారా కూడా ఈ వైరస్ వ్యాపిస్తుందని హెచ్చరిక
ప్రపంచవ్యాప్తంగా ఓ వైపు కరోనా వైరస్ పంజా విసురుతూనే ఉంది. దానికి తోడు వివిధ దేశాల్లో మంకీ పాక్స్ కేసులు భయపెడుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో మరో వైరస్ మహమ్మారి కేసులు బయటపడటం ఆందోళనకరంగా మారుతోంది. పశ్చిమ ఆఫ్రికాలోని ఘనా దేశంలో ప్రమాదకరమైన ‘మార్ బర్గ్’ వైరస్ కేసులు వెలుగుచూశాయి.
ఘనాలోని దక్షిణ అశాంటి రీజియన్ లో ఇద్దరు వ్యక్తులకు ‘మార్ బర్గ్’ వైరస్ సోకినట్టుగా ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. వారితో సన్నిహితంగా మెలిగిన 98 మందిని క్వారంటైన్ లో పెట్టినట్టుగా తెలిపింది. గబ్బిలాలు, అడవి జంతువులకు దూరంగా ఉండాలని.. మాంసం ఉత్పత్తులను బాగా శుభ్రం చేసి, ఉడికించిన తర్వాతే తీసుకోవాలని ఘనా ఆరోగ్య శాఖ ప్రకటించింది.
ప్రాణాలకూ ప్రమాదకరం..
- మార్ బర్గ్ వైరస్ సోకడం వల్ల వచ్చే వ్యాధి ప్రాణాంతకమని.. ఇది సోకినవారిలో 88 శాతం వరకు మరణాల రేటు ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) హెచ్చరించింది. ఈ వైరస్ కు చాలా వేగంగా విస్తరించే సామర్థ్యం ఉందని తెలిపింది. అయితే ఇది గాలి ద్వారా వ్యాపించదు.
- వైరస్ సోకిన వారిని తాకడం వల్ల, రక్తం, ఇతర శరీర ద్రవాల ద్వారా, రోగుల పడక, వస్త్రాలను ఇతరులు వినియోగించడం ద్వారా మార్ బర్గ్ వైరస్ వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
- వైరస్ సోకిన జంతువులు, గబ్బిలాల నుంచి కూడా ఈ వైరస్ మనుషులకు సోకుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.
- ఈ వైరస్ సోకిన వారిలో తీవ్రంగా జ్వరం, తలనొప్పి ఉంటాయి. శరీరంలో అంతర్గతంగా, బయటికి రక్త స్రావం జరుగుతుంది. వైరస్ లక్షణాలు ఒక్కసారిగా బయటపడతాయి. చికిత్స చేయడంలో ఏ మాత్రం జాప్యం జరిగినా ప్రాణాలకు ప్రమాదంగా పరిణమిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
- ఎబోలా వైరస్ తో సమానంగా మార్ బర్గ్ వైరస్ ప్రమాదకరమని.. దీనికి ప్రస్తుతం ఎలాంటి వ్యాక్సిన్లుగానీ, మందులుగానీ లేవని నిపుణులు చెబుతున్నారు.
- ఆఫ్రికా దేశాల్లోని గుహలు, భూగర్భ గనుల్లో నివాసమున్న గబ్బిలాలకు దగ్గరగా ఉండటం వల్ల మార్ బర్గ్ వైరస్ మనుషులకు విస్తరించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు అంచనా వేస్తున్నారు.