Somireddy Chandra Mohan Reddy: జగన్ ఎన్ని గొప్పలు చెప్పుకున్నా.. ఆ క్రెడిట్ చంద్రబాబుదే: సోమిరెడ్డి
- సూక్ష్మసేద్యంలో ఏపీ అగ్రగామిగా నిలవడం వైసీపీ గొప్పదనంగా సాక్షిలో రాసుకున్నారన్న సోమిరెడ్డి
- చంద్రబాబు ఇచ్చిన ప్రోత్సాహకాలతోనే ఇది సాధ్యమయిందని వ్యాఖ్య
- మైక్రో ఇరిగేషన్ కు వైసీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కేటాయించిన పాపాన పోలేదని విమర్శ
సూక్ష్మసేద్యంలో ఏపీ అగ్రగామిగా నిలవడం వైసీపీ ప్రభుత్వ గొప్పతనంగా సాక్షిలో హెడ్ లైన్ లో రాసుకోవడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. సీఎం జగన్ ఎన్ని గొప్పలు చెప్పుకునే యత్నం చేసినా ఆ క్రెడిట్ మాత్రం తమ అధినేత చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు. చంద్రబాబు హయాంలో కేటాయించిన నిధులు, ఇచ్చిన ప్రోత్సాహకాలతోనే ఈరోజు అగ్రస్థానం సాధ్యమైందని చెప్పారు.
వైసీపీ మూడేళ్ల పాలనలో మైక్రో ఇరిగేషన్‌ను పూర్తిగా మూలన పెట్టేశారని సోమిరెడ్డి విమర్శించారు. మైక్రో ఇరిగేషన్ కు ఒక్క రూపాయి కేటాయించిన పాపాన పోలేదని... లేదంటే సాగు విస్తీర్ణం ఇంకా పెరిగేదని అన్నారు. 2002లో కుప్పంలో ఇజ్రాయిల్ టెక్నాలజీ మైక్రో ఇరిగేషన్‌ను ప్రారంభించడం ద్వారా దేశానికి ఈ తరహా సేద్యాన్ని పరిచయం చేసిందే చంద్రబాబు అని చెప్పారు. నవ్యాంధ్రప్రదేశ్ కు చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఈ రంగాన్ని మరింత ప్రోత్సహించారని తెలిపారు. ఏడాదికి రూ. 1,200 కోట్ల వరకు ఖర్చు పెట్టి 2017-18లో మైక్రో ఇరిగేషన్ లో ఏపీని జాతీయ స్థాయిలో అగ్ర స్థానంలో నిలిపారని చెప్పారు. చంద్రబాబు ముందుచూపు వల్లే ఈరోజు 51 శాతం సాగు విస్తీర్ణంతో మరోసారి ఏపీ ముందు నిలిచిందని అన్నారు.