TDP: ఇది జగన్ రెడ్డి ఇష్టానుసార పాలనకు చెంపపెట్టు.. సుప్రీం ఆదేశాలపై చంద్రబాబు
- తప్పులను సమర్థించుకోవడం కోసం వైసీపీ కొత్త తప్పులు చేస్తోందన్న బాబు
- కోవిడ్ నిధులను దారి మళ్లించడం మానవత్వం లేని వైఖరికి నిదర్శనమని వ్యాఖ్య
- ఇప్పటికైనా సుప్రీం కోర్టు ఆదేశాలను సరిగా అమలు చేయాలని డిమాండ్
ఆంధ్రప్రదేశ్ లో కొవిడ్ నిధుల మళ్లింపును సుప్రీంకోర్టు తప్పుపట్టడం, పీడీ ఖాతాలకు మళ్లించిన నిధులను తిరిగి ఎస్డీఆర్ ఎఫ్ ఖాతాకు వెనక్కి ఇవ్వాలని ఆదేశించడం సీఎం జగన్ ప్రభుత్వానికి చెంపపెట్టు అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తప్పులు చేయడమే కాకుండా.. వైసీపీ ప్రభుత్వం వాటిని సమర్థించుకోవడం కోసం కొత్త తప్పులు చేస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు వరుసగా ట్వీట్లు చేశారు.
‘‘నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం రూ.1,100 కోట్ల కొవిడ్ విపత్తు నిధులను దారి మళ్లించడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. దారి మళ్లించిన నిధులను వెంటనే ఎస్డీఆర్ఎఫ్ ఖాతాలో జమ చెయ్యాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు జగన్ రెడ్డి ఇష్టానుసార పాలనకు చెంపపెట్టు వంటివి.
తప్పులు చేస్తున్నదే కాకుండా, వాటిని సమర్థించుకోవడం కోసం వైసీపీ కొత్త తప్పులు చేస్తోంది. కొవిడ్ బాధితులకు సాయంగా అందాల్సిన నిధులను కూడా దారి మళ్లించడం మానవత్వం లేని జగన్ వైఖరికి నిదర్శనం. కొవిడ్ గానీ, వరదలు వంటి విపత్తులు వచ్చినప్పుడు గానీ అదనపు కేటాయింపులతో ప్రజలకు సాయం అందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇలా నిధులు మళ్లించి పబ్బం గడుపుకోవడం బాధితులకు అన్యాయం చెయ్యడమే.
కరోనా పరిహారం అందలేదని ఎవరైనా ఫిర్యాదు చేస్తే, నాలుగు వారాల్లోగా ఫిర్యాదు పరిష్కరించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం సాకులు చెప్పకుండా అమలుచెయ్యాలి. కొవిడ్ తో ఛిన్నాభిన్నం అయిన బాధిత కుటుంబాలను ఇప్పటికైనా ఆదుకోవాలి..” అని చంద్రబాబు నాయుడు వరుస ట్వీట్లలో డిమాండ్ చేశారు.