Marri Shashidhar Reddy: 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ కు వర్షాలు ఎలా పడతాయో తెలియదా?: మర్రి శశిధర్ రెడ్డి
- భారీ వర్షాల వెనుక విదేశీ కుట్రలు ఉన్నాయన్న కేసీఆర్ వ్యాఖ్యలను తప్పు పట్టిన మర్రి
- క్లౌడ్ బరస్ట్ అయితే గంటకు 100 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవుతుందని వ్యాఖ్య
- ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదని విమర్శ
తెలంగాణలో భారీ వర్షాలకు విదేశీ కుట్రలే కారణమని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. క్లౌడ్ బరస్ట్ అయితే గంటకు వంద మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కావాలని ఆయన అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో కేసీఆర్ పర్యటన సందర్భంగా చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ పక్కనే ఉన్నారని... ఆ సమయంలో కేసీఆర్ కు ఆయన ఏం సమాచారం ఇచ్చారని ప్రశ్నించారు.
కేసీఆర్ ను బద్నాం చేయడానికే కాళేశ్వరంను వరద ముంచెత్తినట్టుగా చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పందంగా ఉన్నాయని ఆయన అన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు. 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ కు వర్షాలు ఎలా పడతాయో తెలియదా? అని ఎద్దేవా చేశారు. రానున్న రోజుల్లో నగరాలు, పట్టణాల్లో భారీ వరదలు వస్తాయని... వాటిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని సూచించారు.