Monkeypox Virus: భారత్ లో మరో మంకీ పాక్స్ కేసు.. కేరళలోని కన్నూర్ లో నమోదు
- దుబాయ్ నుంచి కర్ణాటకలోని మంగళూరు ఎయిర్ పోర్టుకు వచ్చిన 31 ఏళ్ల యువకుడు
- అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కేరళలోని కన్నూర్ కు ప్రయాణం
- జ్వరం, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలతో ఆసుపత్రికి
- శాంపిల్స్ ను పరీక్షించి మంకీ పాక్స్ గా నిర్ధారించిన పూణె వైరాలజీ ల్యాబ్
కరోనా మహమ్మారి బారి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీ పాక్స్ వైరస్ మన దేశంలోనూ ఆందోళన రేకెత్తిస్తోంది. ఇప్పటికే కేరళలో ఒక మంకీ పాక్స్ పాజిటివ్ కేసు నమోదుకాగా.. అదే రాష్ట్రంలోని కన్నూర్ లో మరో మంకీ పాక్స్ కేసు నమోదైనట్టు కేరళ అధికారులు ప్రకటించారు. అతడిని ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు.
దుబాయ్ మీదుగా వచ్చాక..
కేరళలోని కన్నూర్ కు చెందిన 31 ఏళ్ల యువకుడు ఈ నెల 13న దుబాయ్ నుంచి కర్ణాటకలోని మంగళూరు విమానాశ్రయానికి వచ్చాడు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కేరళలోని కన్నూర్ కు చేరుకున్నాడు. రెండు రోజుల కిందట చర్మంపై దద్దుర్లు వంటి మంకీ పాక్స్ లక్షణాలు కనిపించడంతో స్థానిక ఆసుపత్రికి వెళ్లాడు. వైద్యులు ఆయన నుంచి శాంపిల్స్ సేకరించి పూణెలోని వైరాలజీ ల్యాబ్ కు పంపించగా.. మంకీ పాక్స్ పాజిటివ్ గా నిర్ధారణ అయిందని కేరళ అధికారులు తెలిపారు.
రెండు కేసులూ కేరళలోనే..
ఇప్పటికే కేరళలోని కొల్లాం జిల్లాలో మన దేశంలోనే తొలి మంకీ పాక్స్ కేసు నమోదైన విషయం తెలిసిందే. దీనిపై అప్రమత్తమైన కేంద్ర ఆరోగ్య శాఖ.. కేరళ ఆరోగ్య శాఖకు సహకరించేందుకు వెంటనే ఒక అత్యున్నత బృందాన్ని పంపింది. విదేశాల నుంచి వచ్చేవారి పట్ల, విదేశాలకు ప్రయాణాలు చేసేవారి విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ ఇటీవలే మార్గదర్శకాలు కూడా జారీ చేసింది.