Virat Kohli: ఫామ్ లో లేక సతమతమవుతున్న కోహ్లీ... సందేశం పంపిన చిన్ననాటి కోచ్
- గత రెండున్నరేళ్లుగా కోహ్లీ విఫలం
- ఇటీవల మరింత దిగజారిన ఆట
- పెరిగిన విమర్శల తాకిడి
- అకాడమీకి వస్తే బాగుంటుందన్న కోచ్
ఒకప్పుడు ప్రపంచ అగ్రశ్రేణి బ్యాట్స్ మన్ గా వెలుగొందిన విరాట్ కోహ్లీ ఇప్పుడు కేవలం గత వైభవం ఆధారంగానే జట్టులో కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. గత రెండున్నరేళ్లుగా కోహ్లీ వైఫల్యాల బాటలో నడుస్తున్నాడు. ఇటీవల అతడి ఫామ్ మరింత దిగజారింది. పట్టుమని పది నిమిషాలు కూడా క్రీజులో నిలవలేకపోతున్నాడు. ఇంగ్లండ్ పర్యటనలోనూ కోహ్లీ పతనం కొనసాగింది.
దాంతో, అతడిని విమర్శించేవాళ్లు, సూచనలు, సలహాలు ఇచ్చేవారి సంఖ్య మరింత పెరుగుతోంది. వెస్టిండీస్ తో వన్డే సిరీస్ కు కోహ్లీకి విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో, అతడు లోపాలపై దృష్టి సారించడానికి ఈ విరామాన్ని ఉపయోగించుకోవాలని పలువురు సూచిస్తున్నారు. కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ కూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చారు. కోహ్లీ ఓసారి ఢిల్లీలో ఉన్న తమ అకాడమీకి వస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
"ఈ అకాడమీ కోహ్లీకి సొంత మైదానం లాంటిది. గతంలో కోహ్లీకి పెద్దగా సమయం దొరికేది కాదు. ఇప్పుడు విరామం దొరికింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. కోహ్లీ ఈ అకాడమీకి వచ్చి హాయిగా ప్రాక్టీసు చేసుకుంటే ఎంతో సంతోషిస్తాను" అని తెలిపారు.
ఫామ్ పరంగా చూస్తే ఎలాంటి లోపాలు కనిపించడంలేదని, కోహ్లీ అవుటైన బంతులు గొప్పవని రాజ్ కుమార్ శర్మ అభిప్రాయపడ్డారు. కోహ్లీ అకాడమీకి వస్తే మాత్రం, అతడి బ్యాటింగ్ లో ఏవైనా లోపాలు ఉంటే తప్పకుండా వాటిపై దృష్టి పెడతాం అని స్పష్టం చేశారు. కోహ్లీ ఇక్కడికి వస్తాడనే భావిస్తున్నామని తెలిపారు.