Pro biotics: ప్రోబయాటిక్స్​ కాదు.. ప్రీబయాటిక్స్​ తోనూ ఎన్నో లాభాలు.. నిపుణుల సూచనలివీ..

   Not Only Probiotics Prebiotics also have many benefits Expert suggestions

  • ఓట్స్, అరటి పండ్లు, యాపిల్స్, ఉల్లిపాయలు, లీక్స్, వెల్లుల్లి, అల్లం వంటివాటితో ఎంతో ప్రయోజనం
  • జీర్ణ వ్యవస్థకు ఆరోగ్యం.. రోగ నిరోధక వ్యవస్థకు బలం
  • ప్రీబయాటిక్స్ బరువు తగ్గేందుకు తోడ్పడతాయన్న నిపుణులు
  • మధుమేహం కూడా నియంత్రణలో ఉంటుందని వెల్లడి

శరీరంలో జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయడానికి, విటమిన్లు, ప్రోటీన్లు శరీరానికి సరిగా అందడానికి పలు రకాల బ్యాక్టీరియాలు ఎంతో తోడ్పడుతాయి. ఓవైపు జీర్ణ వ్యవస్థలోనే ఎదుగుతుండటంతోపాటు పెరుగు వంటి ఆహార పదార్థాల ద్వారా అవి శరీరానికి అందుతుంటాయి. కేవలం ప్రోబయాటిక్స్ మాత్రమేకాకుండా ప్రీ బయాటిక్స్ ను కూడా తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యవంతంగా ఉండటానికి తోడ్పడుతుంది.

ప్రీ బయాటిక్స్ అంటే అవి మరో రకం బ్యాక్టీరియాలు ఏమీ కాదు. మన జీర్ణ వ్యవస్థలో ప్రోబయాటిక్స్ ఎదిగేందుకు, తగిన స్థాయిలో ఉండేందుకు తోడ్పడే ఆహార పదార్థాలే. ఓట్స్, అరటి పండ్లు, యాపిల్స్, ఉల్లిపాయలు, లీక్స్, వెల్లుల్లి, అల్లం వంటివాటితోపాటు పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ప్రీ బయాటిక్స్ గా పనిచేస్తాయి. ఇవి జీర్ణ వ్యవస్థ సంబంధిత సమస్యలను దూరంగా ఉంచడంతోపాటు.. టైప్ –2 మధుమేహం వంటి జీవన శైలి వ్యాధులు తలెత్తకుండా తోడ్పడుతాయి. మరి ప్రీ బయాటిక్స్ తో ఉండే లాభాలేమిటో తెలుసుకుందామా..

జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి దోహదం
ప్రీబయాటిక్స్ మన జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి దోహదం చేస్తుందని పలు పరిశోధనల్లో తేలిందని నిపుణులు చెబుతున్నారు. పేగుల్లో ఉండే ప్రోబయాటిక్ బ్యాక్టీరియాలు ఎదిగేందుకు ఈ తరహా ఆహార పదార్థాలు తోడ్పడుతాయని, ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉంచుతాయని వివరిస్తున్నారు. 

‘‘మన పేగుల్లో వేల రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. అవన్నీ బాగుండాలంటే ఏవో కొన్ని రకాల పోషకాలు సరిపోవు. అందుకే వివిధ రకాల ప్రీబయాటిక్స్ తీసుకోవడం వల్ల మొత్తం మైక్రోబియం సరిగా ఎదుగుతుంది” అని అమెరికాకు చెందిన అకాడమీ ఆఫ్న్యూట్రిషన్ అండ్డైటెటిక్స్ నిపుణులు డెబ్బీ పెటిట్పైన్ తెలిపారు.

మల బద్ధకం సమస్య లేకుండా..
మీరు మలబద్ధకంతో బాధపడుతుంటే ప్రీబయాటిక్స్ మీకు ఎంతో ఉపశమనం అందిస్తాయి. ప్రీబయాటిక్స్ పేగుల కదలికలను మెరుగుపర్చి, మలబద్ధకం లక్షణాలను తగ్గిస్తాయి. అయితే ఐబీఎస్‌ (ఇరిటబుల్‌ బొవెల్‌ సిండ్రోమ్‌)తో బాధపడుతున్న వారు మాత్రం ప్రీ బయాటిక్స్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారిలో ప్రీబయాటిక్స్‌ వల్ల ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కడుపు నిండుగా.. బరువు తగ్గేలా..
అధిక బరువు ఉండి తగ్గాలనుకునే వారికి ప్రీబయాటిక్స్ చాలా బాగా పనికొస్తాయి. ఎందుకంటే ఇవి కొద్దిమొత్తంలో తీసుకున్నా కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి, ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌ లో ప్రచురించబడిన ఒక పరిశోధన కూడా.. ఉల్లిపాయలు, లీక్స్, వెల్లుల్లి, ఓట్స్ వంటి ఆహారాలలో సహజంగా లభించే ఒక రకమైన డైటరీ ఫైబర్ ఒలిగోఫ్రక్టోజ్ అధిక బరువు ఉన్న పెద్దలలో ఆకలి హార్మోన్ గ్రెలిన్‌ ప్రభావాన్ని తగ్గిస్తుందని తేలింది.

శరీరం మినరల్స్‌ ను బాగా సంగ్రహించుకునేలా..
ఆరోగ్యకరమైన ఆహారంలో ఖనిజాలు కీలకమైన భాగం. ఎంతగా ఖనిజాలను తీసుకున్నా మన శరీరం అంటే పేగులు వాటిని పూర్తిస్థాయిలో సంగ్రహించగలగాలి. అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ ప్రకారం.. ప్రీబయాటిక్స్ దంతాలు, ఎముకలకు అవసరమైన కాల్షియం వంటి ఖనిజాల శోషణను మెరుగుపరుస్తాయి.

రక్తంలో చక్కెరను నియంత్రించవచ్చు
మధుమేహంతో బాధపడుతున్నవారికి రక్తంలో చక్కెరను నియంత్రించేందుకు ప్రీబయాటిక్స్‌ తోడ్పడుతాయి. జర్నల్ ఆఫ్ ట్రాన్స్‌లేషనల్ మెడిసిన్ లో ప్రచురితమైన 33 అధ్యయనాల సంయుక్త నివేదిక ప్రకారం.. ప్రీబయాటిక్స్ తీసుకోవడం వల్ల ఉపవాసం ఉన్నంతగా రక్తంలో చక్కెర స్థాయులు తగ్గినట్టు గుర్తించారు. రక్తంలో చక్కెరల స్థాయి నియంత్రణలో ఉందనడానికి గుర్తు అయిన హెచ్‌ బీఏ1సీ స్థాయి బాగా తగ్గినట్టు తేల్చారు.

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది
కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో రోగనిరోధక శక్తిపై అందరికీ ఆసక్తి నెలకొంది. మన జీర్ణ వ్యవస్థలో ఉండే ఆరోగ్యకరమైన మైక్రోబియమ్‌ (మంచి బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు) రోగ నిరోధక వ్యవస్థ పనితీరును పెంచుతుందని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్‌ మెంటల్ రీసెర్చ్ అండ్ పబ్లిక్ హెల్త్‌ లో ప్రచురితమైన పరిశోధన స్పష్టం చేస్తోంది. ప్రీబయాటిక్స్ పేగుల్లోని ప్రయోజనకరమైన బ్యాక్టీరియాకు ఆహారాన్ని అందిస్తాయి, ఇదే సమయంలో రోగనిరోధకతను పెంచుతాయి. ‘‘ప్రీబయాటిక్స్‌ లోని పోషకాలు గుండె జబ్బులు, మధుమేహం, కేన్సర్, ఊబకాయంతోపాటు పలు దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణకు తోడ్పడుతాయి’’ అని పెటిట్‌ పైన్ పేర్కొన్నారు.

మానసిక స్థితీ మెరుగుపడుతుంది
మన జీర్ణ వ్యవస్థకు మన మెదడుకు సంబంధం ఉన్నట్టు శాస్త్రవేత్తలు ఇంతకు ముందే గుర్తించారు. పేగుల్లోని మంచి బ్యాక్టీరియా తగిన స్థాయిలో ఉండి.. జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుంటే.. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

  • Loading...

More Telugu News