Rains: ఏపీలో మరో రెండ్రోజుల పాటు ఓ మోస్తరు వానలు
- కొనసాగుతున్న రుతుపవన ద్రోణి
- తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు అల్పపీడన ప్రభావం
- ఏపీలో ఇవాళ ఉరుములతో కూడిన జల్లులు
- రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
అమరావతి వాతావరణ కేంద్రం ఏపీకి వర్ష సూచన చేసింది. రాష్ట్రంలో మరో రెండ్రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. రుతుపవన ద్రోణితో పాటు అల్పపీడనం ప్రభావం చూపుతున్నట్టు వివరించింది. రుతుపవన ద్రోణి జైసల్మేర్, కోట, గుణా, ఈశాన్య విదర్భ పరిసర ప్రాంతాల వరకు విస్తరించి ఉందని, అల్పపీడనం రాయ్ పూర్, పరదీప్ మీదుగా పయనించి ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సముద్రమట్టానికి 1.5 కిమీ ఎత్తులో ఆవరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
వీటి ప్రభావంతో ఏపీలో రేపు, ఎల్లుండి కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని, తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురుస్తాయని పేర్కొంది. ఇవాళ చాలా ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని, కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వివరించింది. కాగా, ఏపీ, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పడమర దిశల నుంచి గాలులు వీస్తాయని తెలిపింది.