Gold Coins: బాత్రూం కోసం తవ్విన గుంతలో బంగారు నాణేలు
- ఉత్తరప్రదేశ్ లో ఘటన
- గుంతలో రాగిపాత్ర లభ్యం
- రాగిపాత్ర తెరిచి చూస్తే అన్నీ బంగారు నాణేలే!
- స్వాధీనం చేసుకున్న పోలీసులు
ఉత్తరప్రదేశ్ లో ఓ ఇంట్లో బంగారు నాణేలు వెలుగుచూశాయి. జౌన్ పూర్ జిల్లాకు చెందిన నూర్జహాన్ కుటుంబం తమ ఇంట్లో ఓ బాత్రూం నిర్మాణం చేపట్టాలని భావించింది. అందుకోసం తవ్వకాలు చేపట్టగా, కళ్లు చెదిరిపోయేలా బంగారు నాణేలు బయటపడ్డాయి. కూలీలు తవ్విన గుంతలో ఓ రాగిపాత్ర కనిపించింది. దాన్ని తెరిచి చూడగా అన్నీ పసిడి నాణేలు దర్శనమిచ్చాయి.
ఆ నాణేలను సొమ్ముచేసుకోవాలని ఆశించిన నూర్జహాన్ కుటుంబానికి పోలీసులు అడ్డుతగిలారు. బంగారు నాణేలు లభ్యమైన విషయాన్ని నూర్జహాన్ కుటుంబీకులు ఎంత గోప్యంగా ఉంచుదామని అనుకున్నా, అది బట్టబయలైంది.
రాగిపాత్రను వెలికి తీసిన కూలీలకు, నూర్జహాన్ కుటుంబ సభ్యులకు మధ్య గొడవ జరిగింది. వాటా ఇచ్చేందుకు నూర్జహాన్ కుటుంబం ఒప్పుకోకపోవడంతో కూలీలు పని మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయారు. వారు తిరిగి మరుసటి రోజు రాగా నూర్జహాన్ కుటుంబం వారికి ఓ బంగారు నాణెం ఇచ్చింది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి ఊరంతా పాకిపోయింది.
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఆ నాణేలను స్వాధీనం చేసుకున్నారు. అవి బ్రిటీష్ పాలన నాటివని గుర్తించారు. 1889-1920 మధ్య కాలం నాటివని వెల్లడైంది. కాగా, పోలీసులకు భయపడి కొందరు కూలీలు పరారీలో ఉన్నట్టు తెలిసింది.