Madhya Pradesh: మధ్యప్రదేశ్లో పుంజుకుంటున్న కాంగ్రెస్.. హస్తం చేతికి మూడు కార్పొరేషన్లు
- 16 స్థానాలకు ఎన్నికలు
- గతంలో అన్ని స్థానాలను గెలుచుకున్న బీజేపీ
- తాజా ఎన్నికల్లో ఏడింటిని మాత్రమే గెలుచుకున్న వైనం
- బోణీ కొట్టిన ‘ఆప్’, ‘ఎంఐఎం’
- కాంగ్రెస్కు ఆదరణ పెరుగుతోందన్న కమల్నాథ్
మధ్యప్రదేశ్లో తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు అధికార బీజేపీకి నిరాశ మిగల్చగా.. ప్రతిపక్ష కాంగ్రెస్కు ఊరటనిచ్చాయి. రాష్ట్రంలోని మొత్తం 16 నగర పాలక సంస్థలకు తొలి విడతలో జరిగిన ఎన్నికల్లో 11 కార్పొరేషన్లకు గాను ఏడింటిని మాత్రమే బీజేపీ నిలబెట్టుకోగలిగింది. మూడింటిని కాంగ్రెస్ కైవసం చేసుకోగా, ఒకటి ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి దక్కింది.
అలాగే, ఈ ఎన్నికలతో మధ్యప్రదేశ్లో ఎంటరైన అసదుద్దీన్ ఒవైసీ సారథ్యంలోని ఎంఐఎం (MIM) కూడా బోణీ కొట్టింది. జబల్పూర్, బుర్హాన్పూర్, ఖండ్వాలలో మొత్తం నాలుగు కార్పొరేటర్ స్థానాలను చేజిక్కించుకుంది.
గతంలో ఈ 16 కార్పొరేషన్లను బీజేపీ సొంతం చేసుకోగా ఇప్పుడు వాటిలో సగం స్థానాలను కోల్పోయింది. తాజా ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్కు ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని చెప్పేందుకు ఇంతకుమించిన ఉదాహరణ అవసరం లేదన్నారు. అలాగే, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. దేశ ప్రజలు తమను ఆదరిస్తున్నారని చెప్పేందుకు ఇదే నిదర్శనమన్నారు.