Jasti Krishna Kishor: ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిశోర్ పై సీఐడీ కేసు కొట్టివేసిన ఏపీ హైకోర్టు

AP High Court dismissed CID Case on IRS Officer Jasti Krishna Kishor

  • గతంలో ఏపీఈడీబీ సీఈవోగా పనిచేసిన కృష్ణకిశోర్
  • వైసీపీ ప్రభుత్వం వచ్చాక సస్పెన్షన్
  • అవకతవకలకు పాల్పడ్డారంటూ సీఐడీ కేసు
  • కృష్ణకిశోర్ లాభపడినట్టు ఆధారాలు లేవన్న హైకోర్టు

ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిశోర్ పై ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసును ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఏపీఈడీబీ సీఈవోగా పనిచేసిన సమయంలో ఆయన లాభపడినట్టుగా ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. కావాలనే కృష్ణకిశోర్ పై కేసు నమోదు చేసినట్టుగా ఉందని ధర్మాసనం పేర్కొంది. 

గతంలో భజన్ లాల్ కేసులో తీర్పును ఉటంకిస్తూ సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ కేసును కొట్టివేస్తున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 

జాస్తి కృష్ణకిశోర్ గతంలో ఇన్ కమ్ టాక్స్ విభాగం అదనపు కమిషనర్ గా పనిచేశారు. 2015లో ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం కోరిక మేరకు ఆయనను డిప్యూటేషన్ పై రాష్ట్రానికి కేటాయించారు. కృష్ణకిశోర్ ను టీడీపీ ప్రభుత్వం ఏపీ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డు (ఏపీఈడీబీ) సీఈవోగా నియమించింది. అయితే, 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక కృష్ణకిశోర్ ను విధుల నుంచి తప్పించింది. ఏపీఈడీబీ సీఈవోగా అవకతవకలకు పాల్పడ్డారంటూ సీఐడీ కేసు నమోదు చేసింది.

దాంతో, కృష్ణకిశోర్ క్యాట్ ను ఆశ్రయించారు. విచారణ జరిపిన క్యాట్ ఆయనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ కేంద్రానికి నిర్దేశించింది. అనంతరం కృష్ణకిశోర్ ఢిల్లీలోని ఇన్ కమ్ టాక్స్ విభాగం ప్రిన్సిపల్ కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ గ్రేడ్ హోదాతో ఓఎస్డీగా నియమితులయ్యారు. అటు, ఆయనపై నమోదైన కేసు ఏపీ హైకోర్టులో విచారణకు రాగా, ఆ కేసును ధర్మాసనం నేడు కొట్టివేసింది.

  • Loading...

More Telugu News