Shiv Sena: ఉద్ధవ్ థాకరేకు మరో సమస్య... ఏక్ నాథ్ షిండేతో టచ్ లో ఉన్న శివసేన ఎంపీలు!

Shiv Sena MPs allegedly in touch with Shinde
  • ఇప్పటికే ఎమ్మెల్యేలను చీల్చి సీఎం అయిన షిండే
  • ఇప్పుడు ఎంపీలకు ఎసరు
  • ప్రత్యేక బృందంగా 12 మంది ఎంపీలు
  • స్పీకర్ కు లేఖ.. సొంతంగా చీఫ్ విప్ నియామకం
ఇటీవలే శివసేన పార్టీలో తీవ్ర సంక్షోభం ఏర్పడి, పార్టీ అధినేత ఉద్ధవ్ థాకరే చివరికి సీఎం పీఠం నుంచి దిగిపోవాల్సి వచ్చింది. శివసేన నుంచి 40 మంది ఎమ్మెల్యేలను చీల్చిన ఏక్ నాథ్ షిండే బీజేపీ మద్దతుతో సీఎం కుర్చీ ఎక్కారు. ఇప్పుడు ఉద్ధవ్ థాకరే ముందు మరో సమస్య నిలిచింది. శివసేనకు చెందిన పలువురు ఎంపీలు సీఎం ఏక్ నాథ్ షిండేతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. 

శివసేనకు చెందిన 12 మంది ఎంపీలు షిండేతో టచ్ లో ఉన్నారని, పార్లమెంటు సమావేశాల్లో వారు ప్రత్యేక బృందంగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలంటున్నాయి. ప్రస్తుతం షిండే కూడా ఢిల్లీలోనే ఉండడం ఈ వాదనలకు బలం చేకూర్చుతోంది.

కాగా, ఎంపీ రాహుల్ షెవాలే నేతృత్వంలో తాము లోక్ సభలో ప్రత్యేక బృందంగా వ్యవహరిస్తామని శివసేన ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. అంతేకాదు, యవట్మాల్ ఎంపీ భావనా గావ్లీని తమ చీఫ్ విప్ గానూ వారు నియమించుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే ఆమెను శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే చీఫ్ విప్ పదవి నుంచి తొలగించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ భావనా గావ్లీపై వేటు వేశారు. ఆమె స్థానంలో చీఫ్ విప్ గా రాజన్ విచారేను నియమించినా, లోక్ సభ స్పీకర్ దీనిపై తన నిర్ణయం ఇంకా వెల్లడించలేదు. 

శివసేన పార్టీకి లోక్ భలో 19 మంది సభ్యులు ఉన్నారు. తాజా పరిణామాల దృష్ట్యా, వీరిలో 12 మందిని మినహాయిస్తే మిగతా ఏడుగురు థాకరే వర్గంగా భావించాల్సి ఉంటుంది.
Shiv Sena
MPs
Eknath Shinde
Uddhav Thackeray
Lok Sabha
Maharashtra

More Telugu News