Janasena: వరద బాధితుల గోడు ప్రభుత్వానికి పట్టడం లేదు: పవన్ కల్యాణ్
- బటన్ నొక్కడంతోనే సరిపోదన్న పవన్
- మానవత్వంతో వ్యవహరించాలని సూచన
- వరద తగ్గుతున్నా.. బాధితుల ఇక్కట్లు పెరుగుతున్నాయని ఆందోళన
ఏపీలో వరద బాధితుల గోడు ప్రభుత్వానికి పట్టడం లేదంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. బటన్ నొక్కడంతోనే బాధ్యత తీరిపోదన్న పవన్... మానవత్వంతో వ్యవహరించాల్సి ఉందని ప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు వదర బాధితుల గోడును వివరించడంతో పాటుగా వరద బాధితుల పట్ల ప్రభుత్వం చూపుతున్న వైఖరిని ప్రశ్నిస్తూ పవన్ మంగళవారం ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు.
గోదావరి వరద తీవ్రత తగ్గుముఖం పట్టినా... ముంపు బాధితుల ఇక్కట్లు రోజురోజుకూ పెరుగుతున్నాయని పవన్ ఆందోళన వ్యక్తం చేశారు. తూర్పు, ఉభయ పశ్చిమ గోదావరి జిల్లాల్లో వందల గ్రామాల ప్రజలు వరద నీట మునిగి ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు వేల సంఖ్యలో ఉంటే.. నామమాత్రంగానే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం చూస్తుంటే.. వైసీపీ ప్రభుత్వం వరదలపై ఏమాత్రం ముందు జాగ్రత్తగా లేనట్టే కనిపిస్తోందని ఆయన ఆరోపించారు. వరద బాధితుల గోడును ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పవన్ ఆరోపించారు.