TDP: వరద బాధితులకు స్వయంగా భోజనం వడ్డించిన చింతమనేని... వీడియో ఇదిగో
- చింతమనేని సహాయక కార్యక్రమాలపై టీడీపీ ట్వీట్
- ప్రభుత్వం విఫలమైతే విపక్షం చూస్తూ కూర్చోదన్న టీడీపీ
- వేలాది కుటుంబాలకు చింతమనేని అండగా నిలుస్తున్నారని వెల్లడి
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ క్రమంలో వరద బాధితులను ఆదుకునేందుకు టీడీపీ సీనియర్ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రంగంలోకి దిగిపోయారు. మంగళవారం వరద ప్రాంతాలైన వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో పర్యటించారు.
ఈ సందర్భంగా కుక్కునూరు మండలంలోని దాచారం, బెస్త గూడెం పునరావాస కేంద్రాల వద్ద వరద బాధితులకు భోజన ఏర్పాట్లు చేసిన చింతమనేని.. వారికి భోజనాన్ని స్వయంగా వడ్డించారు. ముంపు ప్రాంతాల్లో కనిపించిన ప్రతి అధికారికి చేతులెత్తి నమస్కరిస్తూ సాగిన చింతమనేని... ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు. ఈ మేరకు టీడీపీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో చింతమనేని ఉదారతను కీర్తించింది. అదే సమయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని కూడా ఎండగట్టింది.
ప్రభుత్వం తన బాధ్యతను నెరవేర్చడంలో విఫలమైనప్పుడు ప్రతిపక్షం చూస్తూ కూర్చోదని ఈ సందర్భంగా టీడీపీ పేర్కొంది. తెలుగుదేశం పార్టీ అంటే అధికారంలో ఉన్నా లేకున్నా ఎప్పుడూ ప్రజల పక్షమేనని తెలిపింది. ప్రభుత్వ సహాయం అందడం లేదంటూ వరద బాధితులు మొరపెట్టుకోగా... వెంటనే స్పందించిన చింతమనేని మంగళవారం సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారని తెలిపింది. వేలేరుపాడు మండలంలో 1600 కుటుంబాలకు పాల ప్యాకెట్లు పంపిణీ చేసిన చింతమనేని... బుధవారానికి మరో 10,000 కుటుంబాలకు పాల ప్యాకెట్ల పంపిణీకి ఏర్పాట్లు చేశారని తెలిపింది. 15 టన్నుల కూరగాయల్ని స్వయంగా కొనుగోలు చేసి వరద బాధితులకు అందజేశారని టీడీపీ వెల్లడించింది.