Netizen: మహిళకు 'ఐ లైక్ యూ' సందేశం పంపిన నెటిజన్... చితకబాదిన భర్త... పోలీసుల సమాధానం వైరల్
- మహిళ భర్త మళ్లీ దాడిచేస్తాడేమోనని హడలిపోయిన నెటిజన్
- పోలీసుల సాయం కోరుతూ ట్వీట్
- అతడిని కొట్టకుండా ఉండాల్సిందన్న పోలీసులు
- తాము చూసుకునేవాళ్లమని వ్యాఖ్య
సోషల్ మీడియాలో ఎంతో జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది. కొన్నిసార్లు తేడా వస్తే ఈ సుషాంత్ దత్ పరిస్థితిలా తయారవుతుంది. వివరాల్లోకెళితే.... సుషాంత్ దత్ అనే నెటిజన్ ఓ మహిళకు ఐ లైక్ యూ అంటూ సందేశం పంపాడు. ఆ మహిళ భర్తకు ఈ విషయం తెలియడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సుశాంత్ దత్ ను చితక్కొట్టాడు. ఈ విషయాన్ని సుశాంత్ దత్ పంజాబ్ పోలీసులకు ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.
"సార్... నేను ఒకరికి 'ఐ లైక్ యూ' అని సందేశం పంపాను. కానీ ఆమె భర్త గతరాత్రి నాపై తీవ్రస్థాయిలో దాడి చేశాడు. క్షమించమని పదేపదే కోరినా వినిపించుకోకుండా దారుణంగా కొట్టాడు. ఇప్పుడు నా భద్రతపై ఆందోళన కలుగుతోంది. నా జీవితాన్ని మీరే కాపాడాలి. నాకు మీరు రక్షణ కల్పించాలి" అంటూ పోలీసులను కోరాడు.
అయితే, సుశాంత్ దత్ కు పోలీసులు ఇచ్చిన సమాధానం వైరల్ అవుతోంది. "ఓ మహిళకు అలాంటి సందేశం పంపడం ద్వారా నువ్వు ఏం ఆశించావో మాకు తెలియదు కానీ, వారు నిన్ను కొట్టకుండా ఉండాల్సింది. నీ గురించి మాకు ఫిర్యాదు చేస్తే బాగుండేది. సరైన చట్టాలతో నిన్ను సరిగ్గా చూసుకునేవాళ్లం. అయినా మీ ఇద్దరూ చేసింది తప్పే. దీనిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం" అంటూ పంజాబ్ పోలీసులు బదులిచ్చారు.