BJP: తెలంగాణకు హై పవర్ కమిటీని పంపిస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా
- వరద నష్టంపై అంచనా వేసి కేంద్రానికి నివేదికను సమర్పించనున్న కమిటీ
- నిన్న అమిత్ షాను కలిసిన తరుణ్ చుగ్, బండి సంజయ్
- వర్షాలు, వరదల వల్ల ప్రజల ఇబ్బందిని షాకు వివరించిన నేతలు
భారీ వర్షాలు, వరదల కారణంగా తెలంగాణలో జరిగిన నష్టంపై అంచనా వేయడానికి రాష్ట్రానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన హైపర్ కమిటీ రానుంది. తాజా వర్షాలతో జరిగిన పంట నష్టంపై అంచనా వేసి కేంద్రానికి నివేదిక సమర్పించనుంది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ మంగళవారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమితా షా కలిశారు. దాదాపు అరగంట పాటు జరిగిన ఈ సమావేశంలో భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రంలో ఏర్పడ్డ పరిస్థితులను ఆయనకు వివరించారు. వరదల వల్ల సంభవించిన నష్టాన్ని, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై అమిత్ షా వెంటనే స్పందించారు. హోంశాఖ ఆధ్వర్యంలోని ఉన్నతస్థాయి బృందాన్ని తక్షణమే తెలంగాణకు పంపాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. త్వరలో రాష్ట్రంలో పర్యటించి నష్టాన్ని అంచనా వేయాలని సూచించారని బండి సంజయ్ తెలిపారు. భారీ వర్షాలతో పంటలు, ఇళ్లు దెబ్బతిని ప్రజలతో పాటు వివిధ ప్రాజెక్టులకు జరిగిన నష్టాన్ని ఓపికగా విన్న అమిత్ షాకు సంజయ్ ధన్యవాదాలు తెలిపారు.