Nagababu: క్షమాపణలు కోరితే క్షమించడం మన మెగా జనసైనికుల ధర్మం: 'సీపీఐ నారాయణ వ్యాఖ్యల' విషయంలో నాగబాబు
- చిరంజీవిని ఊసరవెల్లి అన్న సీపీఐ నారాయణ
- ఆ తర్వాత క్షమాపణ చెప్పిన వైనం
- ఆయనను ట్రోల్ చేయడం మానుకోవాలని విజ్ఞప్తి
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణను జనసైనికులు క్షమించాలని నాగబాబు అన్నారు. తప్పు ఎవరు చేసినా సరే... ఒకసారి క్షమాపణలు కోరితే క్షమించడం మన జనసైనికుల ధర్మమని చెప్పారు. కాబట్టి, సీపీఐ నారాయణ పెద్ద వయసును దృష్టిలో ఉంచుకుని ఆయనను ట్రోల్ చేయడం మానుకోవాలని మన మెగా జనసైనికులందరినీ కోరుతున్నానని నాగబాబు అన్నారు.
అసలు విషయంలోకి వెళ్తే.. చిరంజీవి, పవన్ కల్యాణ్ లపై ఇటీవల సీపీఐ నారాయణ విమర్శలు గుప్పించారు. చిరంజీవిని రంగులు మార్చే ఊసరవెల్లిగా అభివర్ణించారు. అల్లూరి సీతారామరాజు జయంతి రోజున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరై భీమవరంలో నిర్వహించిన అల్లూరి విగ్రహావిష్కరణ సభకు సూపర్ స్టార్ కృష్ణను ఆహ్వానిస్తే బాగుండేదని, కానీ అలా కాకుండా ఊసరవెల్లిలా ప్రవర్తించే చిరంజీవిని సభా వేదికపైకి తీసుకురావడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. ఇక పవన్ కల్యాణ్ ల్యాండ్‌మైన్ లాంటి వారని, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో ఆయనకే తెలియదని నారాయణ ఎద్దేవా చేశారు.
ఈ వ్యాఖ్యల పట్ల నాగబాబు చాలా తీవ్రంగా ప్రతిస్పందించారు. నారాయణ అన్నం తినడం మానేసి చాలా కాలం అయిందని... కేవలం గడ్డి, చెత్తా చెదారం తింటున్నారని అన్నారు. మెగా అభిమానులందరూ ఆయనతో గడ్డి తినడం మాన్పించి, కాస్త అన్నం పెట్టండి అని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని నారాయణ చెప్పారు. తన వ్యాఖ్యలను భాషా దోషంగా భావించాలని ఆయన అన్నారు.