Telangana: తెలంగాణలో ధాన్యం సేకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రులు గోయల్, కిషన్ రెడ్డి
- ధాన్యంతో పాటు బియ్యం కొనుగోలుకూ సిద్ధమన్న మంత్రులు
- ఇప్పటికే ఎఫ్సీఐకి ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడి
తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై నెలకొన్న ప్రతిష్ఠంభన తొలగించే దిశగా కేంద్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ధాన్యం సేకరణకు భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ)కి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, కిషన్ రెడ్డిలో ఓ కీలక ప్రకటన చేశారు.
తెలంగాణలో పండిన ధాన్యం సేకరణలో జాప్యం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్న కేంద్ర మంత్రులు... నేరుగా రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించేందుకు ఎఫ్సీఐకి ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. తెలంగాణ రైతుల నుంచి ధాన్యంతో పాటు బియ్యాన్ని కూడా సేకరించేందుకు త్వరలోనే ఎఫ్సీఐ రంగంలోకి దిగుతుందని వారు ప్రకటించారు. ధాన్యం సేకరణ విషయంలో తెలంగాణ సర్కారు రాజకీయం చేస్తోందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు ఆరోపించారు.