Britain: బ్రిటన్ ప్రధాని పదవికి అడుగు దూరంలో రిషి సునాక్... ఐదో రౌండ్లో కూడా మొదటి స్థానమే!
- బోరిస్ జాన్సన్ రాజీనామాతో నూతన ప్రధాని ఎన్నిక
- ఐదో రౌండ్లో 137 ఓట్లు సాధించిన సునాక్
- 113 ఓట్లతో రెండో స్థానంతో సరిపెట్టుకున్న లిజ్ ట్రస్
బ్రిటన్ ప్రధాని పదవి రేసులో దూసుకుపోతున్న భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఆ పదవికి అడుగు దూరంలో నిలిచారు. వివాదాస్పద ఎంపీకి మంత్రి పదవి ఇచ్చి విమర్శలపాలైన బోరిస్ జాన్సన్ ప్రధాని పదవికి రాజీనామా చేయగా...ఆయన వారసుడిని ఎన్నుకునే ప్రక్రియను అధికార కన్జర్వేటివ్ పార్టీ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. పార్టీ నాయకుడిని ఎన్నుకునేందుకు జరుగుతున్న ఎన్నికల్లో ఇప్పటికే 4 రౌండ్లు పూర్తి కాగా... తాజాగా బుధవారం ఐదో రౌండ్ ఎన్నికలు ముగిశాయి.
ఐదో రౌండ్ ఎన్నికల్లో రిషి సునాక్ అందరికంటే అధిక ఓట్లు సాధించి, తొలి స్థానంలో నిలిచారు. ఐదో రౌండ్ ఓటింగ్‌లో సునాక్‌కు 137 ఓట్లు దక్కాయి. సునాక్ తర్వాతి స్థానంలో నిలిచిన లిజ్ ట్రస్‌కు 113 ఓట్లు మాత్రమే లభించాయి. దీంతో ప్రధాని పదవి రేసులో మరో అడుగు ముందుకేసిన సునాక్ ఆ పదవికి అడుగు దూరంలో నిలిచారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి కూతురు అక్షతను సునాక్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.