Telangana: తెలంగాణలో గ‌వ‌ర్న‌ర్ కోటా ఎమ్మెల్సీల వివాదంపై హైకోర్టులో విచార‌ణ‌... ఇంప్లీడ్ పిటిష‌న్‌కు అనుమ‌తి

ts high court allows implead petition in the governor quota mlcs row

  • గోర‌టి వెంక‌న్న స‌హా ముగ్గురు ఎమ్మెల్సీల నియామ‌కం అక్ర‌మ‌మ‌న్న ధ‌న‌పాల్‌
  • త‌న‌ను ఎమ్మెల్సీగా నియ‌మించేలా ఉత్త‌ర్వులు జారీ చేయాల‌ని హైకోర్టులో పిటిష‌న్‌
  • 2020లో వేసిన పిటిష‌న్‌కు తాజాగా ఇంప్లీడ్ పిటిష‌న్ దాఖలు
  • గ‌వ‌ర్న‌ర్‌, అసెంబ్లీ కార్య‌ద‌ర్శి, రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారుల‌ను ప్ర‌తివాదులుగా చేర్చిన కోర్టు
  • విచార‌ణ ఆగ‌స్టు 30కి వాయిదా

తెలంగాణ‌లో గ‌వ‌ర్న‌ర్ కోటా ఎమ్మెల్సీలుగా గోర‌టి వెంక‌న్న‌, బ‌స‌వ‌రాజు సార‌య్య‌, ద‌యానంద్‌ల నియామ‌కం చెల్ల‌దంటూ ధ‌న‌పాల్ అనే వ్య‌క్తి వేసిన పిటిష‌న్‌పై బుధ‌వారం తెలంగాణ హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా 2020లో వేసిన పిటిష‌న్‌కు అనుబంధంగా పిటిష‌న‌ర్ మ‌రో పిటిష‌న్‌ను దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్‌ను ఇంప్లీడ్ చేసేందుకు హైకోర్టు అనుమ‌తించింది. ఇంప్లీడ్ పిటిష‌న్ ద్వారా గ‌వ‌ర్న‌ర్‌, అసెంబ్లీ సెక్ర‌ట‌రీ, రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన క‌మిష‌న‌ర్‌ను హైకోర్టు ప్ర‌తివాదులుగా అనుమ‌తించింది.

గోర‌టి వెంక‌న్న స‌హా ముగ్గురిని గ‌వ‌ర్న‌ర్ కోటా కింద తెలంగాణ స‌ర్కారు ప్ర‌తిపాదించగా... గ‌వ‌ర్న‌ర్ ఆమోదం లేకుండానే కేసీఆర్ కేబినెట్ ఆమోదం ద్వారా ఆ ముగ్గురిని ఎమ్మెల్సీలుగా నియ‌మించార‌ని ధ‌న‌పాల్ 2020లో హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. గ‌వ‌ర్న‌ర్ కోటా ఎమ్మెల్సీల ఎంపిక నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా జ‌రిగింద‌ని ఆయ‌న కోర్టుకు తెలిపారు.

అంతేకాకుండా గ‌వ‌ర్న‌ర్ త‌న పూర్తి విచ‌క్ష‌ణాధికారంతో గ‌వ‌ర్న‌ర్ కోటా ఎమ్మెల్సీల‌ను నియ‌మించ‌లేద‌ని ఆయ‌న వాదించారు. త‌న పేరును గ‌వ‌ర్న‌ర్ కోటా ఎమ్మెల్సీ కోసం స్వ‌యంగా గ‌వ‌ర్న‌రే ప్ర‌తిపాదించినా... త‌న‌కు ద‌క్కాల్సిన అవ‌కాశాన్ని అడ్డుకున్న ప్ర‌భుత్వం... గోరటి వెంక‌న్న త‌దిత‌రుల‌కు క‌ల్పించింద‌ని ఆయ‌న ఆరోపించారు. త‌న‌ను ఎమ్మెల్సీగా నియ‌మించేలా ప్ర‌భుత్వానికి ఉత్త‌ర్వులు జారీ చేయాల‌ని ధ‌న‌పాల్ త‌న పిటిష‌న్‌లో కోర్టును కోరారు.

ఈ పిటిష‌న్‌పై విచార‌ణ కొన‌సాగుతుండ‌గా... తాజాగా ఈ కేసులో గ‌వ‌ర్న‌ర్‌, అసెంబ్లీ కార్య‌ద‌ర్శి, రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారుల‌ను కూడా ప్ర‌తివాదులుగా చేర్చాలంటూ పిటిష‌నర్ తాజాగా ఇంప్లీడ్ పిటిష‌న్ వేశారు. దీనిపై బుధ‌వారం విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు ఇంప్లీడ్ పిటిష‌న్‌కు అనుమ‌తి ఇచ్చింది. ఈ పిటిష‌న్‌పై తదుప‌రి విచార‌ణ‌ను ఆగ‌స్టు 30కి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News