Telangana: వరదలతో రూ.1,400 కోట్ల నష్టం.. తక్షణమే వెయ్యి కోట్లు ఇవ్వండి: కేంద్రానికి తెలంగాణ నివేదన
- వరద వల్ల 5 శాఖల పరిధిలో నష్టం వాటిల్లిందన్న తెలంగాణ
- ఇప్పటిదాకా తెలంగాణ నష్టంపై నివేదిక ఇవ్వలేదన్న కిషన్ రెడ్డి
- ఆ వెంటనే నివేదికను సిద్ధం చేసి పంపిన తెలంగాణ సర్కారు
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో రూ.1,400 కోట్ల మేర నష్టం వాటిల్లిందని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలో తక్షణ సాయం కింద రూ.1,000 కోట్లు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు బుధవారం తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఓ నివేదిక పంపింది. ఈ నివేదికలో వర్షాల కారణంగా ఏఏ శాఖలకు ఎంతమేర నష్టం వాటిల్లిందన్న విషయంపై సమగ్ర వివరాలను తెలంగాణ ప్రభుత్వం పొందుపరచింది.
రోడ్లు, భవనాల శాఖకు రూ.498 కోట్లు, పంచాయతీ రాజ్ శాఖకు రూ.449 కోట్లు, నీటి పారుదల శాఖకు రూ.33 కోట్లు, పురపాలక శాఖకు రూ.379 కోట్లు, విద్యుత్ శాఖకు రూ.7 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ఆ నివేదికలో కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ సర్కారు నివేదించింది. వరద నష్టంపై తెలంగాణ నుంచి ఇంకా తమకు ఎలాంటి నివేదిక అందలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించిన కొన్ని గంటల వ్యవధిలోనే తెలంగాణ సర్కారు కేంద్రానికి నివేదిక పంపడం గమనార్హం.