heatwave: బ్రిటన్ లో రైలు సిగ్నళ్లు మాడి మసైపోయేంత ఉష్ణోగ్రతలు
- 45 డిగ్రీల వరకు పలు ప్రాంతాల్లో నమోదు
- యూకేలో రైలు సేవలకు అంతరాయం
- అడవుల్లో కార్చిచ్చులు
- సాధారణ జీవనానికి ఇబ్బందులు
అధిక ఉష్ణోగ్రతల ధాటికి యూరప్ వ్యాప్తంగా పలు ప్రాంతాలు వణికిపోతున్నాయి. పోర్చుగల్, స్పెయిన్, ఫ్రాన్స్, గ్రీస్, క్రోటియాల్లో కార్చిచ్చులు అడవులను దహించి వేస్తున్నాయి. సాధారణ జనజీవనానికి ఇబ్బందులు నెలకొన్నాయి. యూకేలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ ను దాటేశాయి.
భారత్ వంటి ఉష్ణ మండల దేశాలకు ఈ స్థాయి ఉష్ణోగ్రతలు సాధారణంగా అనుభవమే. కానీ, యూరప్ కు ఇవి చాలా ఎక్కువ. అక్కడ ఎండ తీవ్రతకు రైలు సిగ్నళ్లు కరిగిపోతున్నాయి. కరిగిపోయిన వాటి దృశ్యాలను నేషనల్ రైల్వేస్ స్వయంగా తన ట్విట్టర్ హ్యాండిల్ లో ఉంచింది. వీటిని చూస్తే అక్కడ ఎండల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.
లోహం కరిగిపోయి రైలు సిగ్నల్ లైట్లు కనిపించకపోవడంతో.. రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఈస్ట్ కోస్ట్ మెయిన్ లైన్ లో ప్రయాణించే వారు సేవల గురించి పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని రైల్వే విభాగం సూచించింది. ఎండల వల్ల పలు ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు కూడా సంభవిస్తున్నాయి. పీటర్ బర్గ్, లండన్ కింగ్ క్రాస్ మార్గంలోనూ అగ్ని ప్రమాదం ఏర్పడినట్టు నేషనల్ రైల్వేస్ తెలిపింది. ఒక ప్రాంతంలో అయితే మీటర్ పై ఉష్ణోగ్రత 44.5 డిగ్రీల సెల్సియస్ అని చూపిస్తోంది.