KVP Ramachandra Rao: ఈడీ విచారణలకు కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత అన్నీ మోదీనే: కేవీపీ రామచంద్రరావు
- ఈడీని కేంద్రం ఒక ఆయుధంగా వాడుతోందన్న కేవీపీ
- ఈడీ అధికారులు కేవలం నిమిత్తమాత్రులేనని వ్యాఖ్య
- గాంధీ, నెహ్రూ పేర్లను రాజకీయాల్లో లేకుండా చేయాలనుకుంటున్నారని విమర్శలు
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈడీని కేంద్రం ఒక ఆయుధంగా వాడుకుంటోందని ఆయన అన్నారు. ఈడీ విచారణలకు సంబంధించి కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత అన్నీ మోదీ అని... అమలు చేసేది అమిత్ షా అని చెప్పారు. ఈడీ అధికారులు కేవలం నిమిత్తమాత్రులేనని అన్నారు. అయినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాంగ్రెస్ అగ్రనేతలు ఈడీ కేసుల నుంచి బయటపడతారని అన్నారు.
గాంధీ, నెహ్రూ పేర్లను రాజకీయాల్లో లేకుండా చేయాలని బీజేపీ అనుకుంటోందని... ఇది వ్యర్థ ప్రయత్నంగానే మిగిలిపోతుందని కేవీపీ చెప్పారు. ఇలాంటి చర్యల వల్ల గాంధీ, నెహ్రూ కుటుంబాలకు ఇమేజ్ పెరుగుతుందే తప్ప, ఎలాంటి డ్యామేజ్ జరగదని అన్నారు. మరోవైపు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తొలి రోజు ఈడీ విచారణ కాసేపటి క్రితం ముగిసింది. 3 గంటల పాటు అధికారులు ఆమెను విచారించారు. ఈ నెల 25న మళ్లీ విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేశారు.