Bundelkhand Expressway: మోదీ ప్రారంభించిన 5 రోజులకే కోతకు గురైన బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే... వీడియో ఇదిగో
- గత శనివారం బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించిన మోదీ
- తాజా వరదల నేపథ్యంలో ఓ చోట కొట్టుకుపోయిన రోడ్డు
- వీడియోను పోస్ట్ చేసిన సీనియర్ జర్నలిస్ట్ రన్విజయ్ సింగ్
ఉత్తరప్రదేశ్‌లో అత్యంత వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు పొందిన బుందేల్‌ఖండ్ రూపు రేఖలు మార్చేస్తుందంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పిన బుందేల్ ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభమైన 5 రోజులకు ఓ చోట రోడ్డు కోతకు గురై కొట్టుకుపోయింది. గత శనివారం బుందేల్‌ఖండ్ పరిధిలోని జలాన్‌లో అట్టహాసంగా ఏర్పాటు చేసిన వేదిక మీద మోదీ ఈ జాతీయ రహదారిని ప్రారంభించారు. బుందేల్‌ఖండ్ పరిధిలోని ఏడు జిల్లాల మీదుగా సాగే ఈ రహదారితో ఆ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని, తత్ఫలితంగా ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆ సందర్భంగా మోదీ చెప్పారు.
తాజాగా దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో రోజుల తరబడి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయిపోతున్నాయి. ఇందులో భాగంగా గత శనివారం మోదీ ప్రారంభించిన బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వేపై కూడా చాలా ప్రాంతాల్లో వరద నీరు పొంగి పొరలింది. ఈ కారణంగా జాతీయ రహదారిపై ఓ చోట మొత్తం రోడ్డు కొట్టుకుపోయి... ఖాళీ ఏర్పడింది.
ఈ దృశ్యాన్ని సీనియర్ జర్నలిస్ట్ రన్విజయ్ సింగ్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. మోదీ ప్రారంభించిన హైవే 5 రోజులకే ఇలా కొట్టుకుపోయిందంటూ ఆయన ఓ కామెంట్‌ను దానికి జత చేశారు. ఇదిలా ఉంటే... బుందేల్ ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం పూర్తి కాకుండానే మోదీ ప్రారంభించారని, అయితే తాజా వర్షాలు ఆ విషయాన్ని బట్టబయలు చేశాయంటూ విపక్ష సమాజ్ వాదీ పార్టీ మరో వీడియోను పోస్ట్ చేసింది.