Joe Biden: 'నాకు క్యాన్సర్' అంటూ జో బైడెన్ చేసిన వ్యాఖ్యలతో సంచలనం... వివరణ ఇచ్చిన వైట్ హౌస్
- మసాచుసెట్స్ లో బైడెన్ పర్యటన
- సోమర్సెట్ లో ఓ పాత బొగ్గు గని సందర్శన
- వాతావరణ కాలుష్యంపై ప్రసంగం
- డెలావర్ లో క్యాన్సర్ రేటు ఎక్కువన్న బైడెన్
- తనతో పాటు చాలామంది క్యాన్సర్ బారినపడ్డారని వెల్లడి
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తనకు క్యాన్సర్ అంటూ కలకలం రేపారు. ఆయన మసాచుసెట్స్ లోని సోమర్సెట్ వద్ద ఉన్న ఓ మూతపడిన బొగ్గు గనిని సందర్శించారు. వాతావరణ మార్పులపై ఉద్యమించేందుకు అవసరమైన కార్యనిర్వాహక ఆదేశాలపై చర్చించేందుకు ఆయన ఈ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'నాకు క్యాన్సర్ ఉంది' అనేసరికి అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. ట్విట్టర్ లో ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
దీనిపై అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ వెంటనే స్పందించింది. గతేడాది జనవరిలో తాను పదవీ బాధ్యతలు చేపట్టడానికి ముందు తీసుకున్న చర్మ క్యాన్సర్ చికిత్స గురించి జో బైడెన్ ఆ విధంగా ప్రస్తావించారని వైట్ హౌస్ చెప్పుకొచ్చింది.
అసలు, బైడెన్ తన ప్రసంగంలో ఏమన్నారంటే... "మేం చిన్నప్పుడు డెలావర్ లో ఉండేవాళ్లం. మేం నడవగలిగినవాళ్లమే అయినా మా అమ్మ ఎప్పుడూ నడిచి వెళ్లనిచ్చేది కాదు. కారులో స్వయంగా తీసుకెళ్లేది. ఎందుకంటే, అక్కడి చమురు శుద్ధి కర్మాగారాల నుంచి విడుదలయ్యే ఉద్గారాలే. అక్కడి వాతావరణ కాలుష్యం ఎంతలా ఉండేదంటే, కారు వెళుతున్నప్పుడు అద్దాలపై పడే చమురు పదార్థాలను తొలగించడానికి వైపర్లు ఆన్ చేయాల్సి వచ్చేది. ఈ తరహా దారుణమైన వాతావరణంలో పెరిగిన నేనే కాదు, నాతో పాటు చాలామంది క్యాన్సర్ బారినపడాల్సి వచ్చింది. అమెరికాలోకెల్లా డెలావర్ చాలాకాలంగా అత్యధిక క్యాన్సర్ పీడిత ప్రాంతంగా నిలిచింది" అని వెల్లడించారు.