Pingali Venkaiah: జాతీయ పతాకం రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మి కన్నుమూత
- 100 ఏళ్ల వయసులో కన్నుమూసిన సీతామహాలక్ష్మి
- మాచర్లలో కుమారుడి వద్ద ఉంటున్న పింగళి కుమార్తె
- ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసిన జగన్, చంద్రబాబు
మన దేశ జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి కన్నుమూశారు. సంపూర్ణ జీవితాన్ని గడిపిన ఆమె... సరిగ్గా 100 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా మాచర్లలో ప్రియదర్శిని కాలనీలో తన కుమారుడు జీవీ నరసింహారావు వద్ద ఆమె ఉంటున్నారు. కుమారుడి ఇంట్లోనే నిన్న రాత్రి ఆమె కన్నుమూశారు. వయోభారంతో పాటు గత కొంత కాలంగా అనారోగ్యంతో కూడా ఆమె బాధపడుతున్నారు.
మరోవైపు సీతామహాలక్ష్మి మృతి పట్ల ముఖ్యమంత్రి జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు జగన్ చెప్పారు. గత ఏడాది స్వయంగా మాచర్లకు వచ్చి సీతామహాలక్ష్మిని జగన్ సత్కరించారు. ఆమెకు ఆర్ధిక సాయంగా రూ. 75 లక్షల చెక్కును అందించారు. ఆమెతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు.
పింగళి వెంకయ్య గారి కుమార్తె సీతామహాలక్ష్మిగారి మరణం విచారకరమని చంద్రబాబు అన్నారు. దేశ స్వాతంత్ర్యోద్యమంలో తండ్రికి తోడుగా నిలిచి, ఆ తర్వాత పింగళి గొప్పదనం నేటి తరానికి తెలిసేలా సీతామహాలక్ష్మీ గారు ఎంతో కృషి చేశారని కొనియాడారు. సీతామహాలక్ష్మి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ... వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.
డాలస్, టెక్సాస్ - భారతదేశ జాతి గౌరవంఅయిన మన జాతీయపతాక రూపశిల్పి పింగళి వెంకయ్య గారి కుమార్తె శ్రీమతి ఘంటసాల సీతామహాలక్ష్మి గారి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ శాసనసభ పూర్వ ఉపసభాపతి డా. మండలి బుద్ధప్రసాద్, తానా పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర ఒక పత్రికా ప్రకటనలో ఆమె కుటుంబ సభ్యులకు తమ తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు.