Rakesh Jhunjhunwala: ట్రేడింగ్ దిగ్గజం రాకేశ్ ఝున్ ఝున్ వాలాకు చెందిన 'ఆకాశ ఎయిర్' విమానాలకు బుకింగ్స్ ప్రారంభం
- ఆకాశ ఎయిర్ లో ఝున్ ఝున్ వాలా పెట్టుబడులు
- ఆగస్ట్ 7న ప్రారంభం కానున్న సర్వీసులు
- 72 విమానాల కోసం బోయింగ్ తో ఒప్పందం కుదుర్చుకున్న ఆకాశ ఎయిర్
స్టాక్ మార్కెట్ దిగ్గజ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్ ఝున్ వాలా విమానయానం రంగంలోకి అడుగు పెట్టిన సంగతి విదితమే. 'ఆకాశ ఎయిర్' సంస్థలో ఆయన పెట్టుబడులు పెట్టారు. ఆగస్ట్ 7 నుంచి ఆకాశ ఎయిర్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ముంబై-అహ్మదాబాద్ రూట్లో తొలి సర్వీస్ ప్రారంభం కానుంది. బోయింగ్ 737 మ్యాక్స్ ప్లేన్ తో తొలి సర్వీసును ఆకాశ ఎయిర్ ప్రారంభించనుంది.
ఆగస్ట్ 7 నుంచి ప్రారంభమయ్యే ముంబై-అహ్మదాబాద్ రూట్ కి, ఆగస్ట్ 13 నుంచి ప్రారంభమయ్యే బెంగళూరు-కొచ్చి రూట్ కు బుకింగ్స్ ప్రారంభమయ్యాయని ఆకాశ ఎయిర్ ఈరోజు ప్రకటించింది. రెండు బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల ద్వారా ఆకాశ తన సర్వీసులను ప్రారంభించబోతోంది. ఒక విమానాన్ని బోయింగ్ సంస్థ ఇప్పటికే డెలివరీ చేసింది. మరో విమానాన్ని ఈ నెలాఖరులోగా డెలివరీ చేయనుంది.
ముంబై-అహ్మదాబాద్ సర్వీసుతో తమ కార్యకలాపాలను ప్రారంభిస్తున్నామని ఆకాశ ఎయిర్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ ప్రవీణ్ అయ్యర్ తెలిపారు. బ్రాండ్ న్యూ బోయింగ్ విమానాలతో సర్వీసులను ప్రారంభిస్తున్నామని చెప్పారు. దశల వారీగా తమ నెట్ వర్క్ ను ఇతర నగరాలకు విస్తరింపజేస్తామని తెలిపారు. తొలి ఏడాదిలో ప్రతి నెల రెండు విమానాల చొప్పున తమ ఫ్లీట్ లో చేర్చుకుంటామని చెప్పారు. మొత్తం 72 విమానాలకు బోయింగ్ తో ఆకాశ ఎయిర్ ఒప్పందం కుదుర్చుకుంది.