Mexico: చనిపోయిన పుట్‌బాలర్ శవపేటికతో గోల్ కొట్టించిన మిత్రులు... కన్నీళ్లు పెట్టించే వీడియో ఇదిగో!
- మెక్సికోలో హత్యకు గురైన టీనేజీ ఫుట్ బాలర్
- చివరి గోల్‌తోనే అతడికి వీడ్కోలు పలికిన సహచరులు
- వీడియోను పోస్ట్ చేసిన పారిశ్రామిక దిగ్గజం హర్ష్ గోయెంకా
అతడో టీనేజీ కుర్రాడు. పుల్ బాల్ ఆటలో ఆరితేరాడు. అయితే అనుకున్న భారీ లక్ష్యాలేమీ చేరుకోలేదు. ఇంతలోనే అతడు హత్యకు గురయ్యాడు. అతడి సహచర ఆటగాళ్లు వేదనలో కూరుకుపోయారు. అతడి ఆట తీరు గుర్తు చేసుకుంటూ శోకంలో మునిగిపోయారు. ఎంత రోదించినా... చనిపోయిన వాడికి తుది వీడ్కోలు పలకక తప్పదు కదా. మరి ఆ వీడ్కోలును మిత్రుడికి ఎలా ఇవ్వాలని సహచరులు ఆలోచించారు. చివరి గోల్‌తో మిత్రుడికి వీడ్కోలు పలికేలా వ్యూహం రచించారు.
చనిపోయిన మిత్రుడి మృతదేహాన్ని శవపేటికలో పెట్టారు. ఓ గోల్ పోస్ట్ ముందు శవపేటికను పెట్టారు. ఓ సహచరుడు గోల్ కీపర్ అవతారం ఎత్తితే.. మిగిలిన వారు శవపేటికలోని మిత్రుడితో కలిసి మైదానంలో ఆట ఆడుతున్న తీరుగా నిలబడ్డారు. వారి చుట్టూ చేరిన మృతుడి బంధువులు, ఇరుగు పొరుగు వారు చూస్తుండగా...మృతుడి సహచరుడు ఫుట్ బాల్‌ను కాలితో తన్నాడు. ఆ బాల్‌ను అందుకున్న మరో మిత్రుడు దానిని నేరుగా శవపేటికకు గురి పెట్టాడు. ఆ బాల్ శవపేటికను తాకి నేరుగా గోల్ పోస్ట్‌లోకి వెళ్లింది. అంతే... శవపేటికలోని తమ మిత్రుడే గోల్ కొట్టాడంటూ అతడి మిత్రులంతా శవపేటికపై పడి అతడిని అభినందిస్తూ అలా కొన్ని సెకన్ల పాటు ఉండిపోయారు.
కన్నీళ్లు పెట్టిస్తున్న ఈ దృశ్యం మెక్సికోలో చోటుచేసుకుంది. ఈ వీడియోను ఆర్ఎస్పీ గోయెంకా చైర్మన్ హర్ష్ గోయెంకా ట్విట్టర్లో షేర్ చేశారు. 'చనిపోయిన సహచరుడితో చివరి గోల్ కొట్టించిన ఆటగాళ్లు..' అంటూ గోయెంకా సదరు వీడియోకు ఓ కామెంట్‌ను జత చేశాడు. కదిలించే వీడియో.. అంటూ పేర్కొన్న ఆయన ఆ వీడియోను పోస్ట్ చేస్తూ తాను చలించిపోయారు.