President Of India: భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము... ఈసీ అధికారిక పత్రం ఇదిగో
- రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచిన ద్రౌపది ముర్ము
- యశ్వంత్ సిన్హాపై భారీ మెజారిటీతో ముర్ము గెలుపు
- తాజాగా అధికారిక పత్రాన్ని విడుదల చేసిన ఎన్నికల సంఘం
భారత నూతన రాష్ట్రపతిగా అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన ద్రౌపది ముర్ము నిన్న విజయం సాధించారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసిన కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాపై ఆమె రికార్డు మెజారిటీతో విజయం సాధించారు. ఈ క్రమంలో గురువారం రాత్రే ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీకి చెందిన అగ్ర నేతలు, విపక్షాలకు చెందిన నేతలు, ఆమె చేతిలో ఓడిపోయిన యశ్వంత్ సిన్హా, దేశంలోని దాదాపుగా అన్ని వర్గాలు ఆమెను శుభాకాంక్షలతో ముంచెత్తాయి.
తాజాగా శుక్రవారం రాత్రి రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము విజయం సాధించినట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక పత్రాన్ని విడుదల చేసింది. ఈ పత్రంపై ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ అనూప్ చాన్ పాండేలు సంతకాలు చేశారు. వారిద్దరే ముర్ము అధికారిక ఎన్నిక పత్రాన్ని విడుదల చేశారు.