Rizwan Ashraf: అవును! నుపుర్‌శర్మను చంపేందుకు వచ్చా: పాక్ పౌరుడు
- ఈ నెల 16న భారత్-పాక్ సరిహద్దు వద్ద పట్టుబడిన రిజ్వాన్
- అతడి నుంచి రెండు కత్తులు స్వాధీనం చేసుకున్న అధికారులు
- ఉగ్రవాద బోధనలతో ప్రభావితమయ్యానని వెల్లడి
బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మను చంపేందుకే తాను భారత్‌లో అడుగుపెట్టినట్టు పాకిస్థాన్ పౌరుడు వెల్లడించాడు. భారత్-పాకిస్థాన్ మధ్యనున్న అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఈ నెల 16న రాత్రి అనుమానాస్పదంగా కనిపించిన రిజ్వాన్ అష్రాఫ్ (22)ను బీఎస్ఎఫ్ అదుపులోకి తీసుకుంది. అతడి నుంచి రెండు కత్తులను స్వాధీనం చేసుకుంది. అతడి వద్దనున్న గుర్తింపు కార్డుల ప్రకారం పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని మండి బహౌద్దీన్ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించింది.
అతడిని విచారించగా సంచలన విషయాలు వెల్లడయ్యాయి. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్‌శర్మను చంపేందుకే తాను భారత్ వచ్చినట్టు చెప్పాడు. ఇక్కడకు రావడానికి ముందు తాను మత గురువును కలిసినట్టు పేర్కొన్నాడు. తాను ఎలక్ట్రీషియన్‌నని, ఉగ్రవాద బోధనలతో ప్రభావితమయ్యానని పేర్కొన్నాడు. నుపుర్‌శర్మను చంపడానికే వచ్చినా ఆమె ఎక్కడ ఉంటుందో కూడా తనకు తెలియదని విచారణాధికారులకు చెప్పాడు. రిజ్వాన్ ఏ సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్నాడో తెలియదని అధికారులు తెలిపారు. ప్రస్తుతం అతడిని పోలీసులు, నిఘా వర్గాల అధికారులు సంయుక్తంగా విచారిస్తున్నారు.