Wayanad: కేరళలో కలకలం సృష్టిస్తున్న కొత్త వ్యాధులు.. పందులకు ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్
- కేరళలో ఇప్పటికే మూడు మంకీపాక్స్ కేసుల నిర్ధారణ
- పందులకు సోకింది ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అని నిర్ధారణ
- 300 పందులను సంహరించాలని ప్రభుత్వం ఆదేశం
కేరళను ఇప్పటికే మంకీపాక్స్ కేసులు కలవరపెడుతుండగా, తాజాగా ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కేసులు కూడా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. వయనాడ్ జిల్లా మనంతవాడి ప్రాంతంలో రెండు పందుల పెంపకం కేంద్రాల్లో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ ఆనవాళ్లను గుర్తించారు. అంతేకాదు, ఓ కేంద్రంలో ఇదే వైరస్‌తో 23 పందులు చనిపోవడంతో అప్రమత్తమైన అధికారులు వైరస్ మరిన్ని ప్రాంతాలకు విస్తరించకుండా మరో కేంద్రంలో ఉన్న 300 పందులను సంహరించాలని నిర్ణయించారు. ఈ రెండు కేంద్రాల నుంచి నమూనాలను సేకరించిన అధికారులు భోపాల్‌లోని జాతీయ జంతు వ్యాధుల సంస్థ (National Institute of High Security Animal Diseases)కు పంపించారు.
అక్కడ జరిపిన పరీక్షల్లో పందులకు సోకింది ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్‌గా నిర్ధారణ అయినట్టు అధికారులు తెలిపారు. దీంతో పందులు, వాటి మాంసం ఉత్పత్తులను విక్రయించడం, రవాణా చేయడంపై నిషేధం విధించినట్టు కేరళ పశుసంవర్థకశాఖ మంత్రి జె. చించురాణి తెలిపారు. వ్యాధి సోకిన పందులను సంహరించిన తర్వాత ఆరోగ్య నిబంధనలు పాటిస్తూ, లోతైన గుంతల్లో వాటిని పూడ్చిపెట్టాలని ఆదేశించారు.
కాగా, ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ తొలుత 1921లో కెన్యాలో వెలుగుచూసింది. తర్వాత దక్షిణాఫ్రికా, అంగోలా తదితర దేశాలకు వ్యాపించింది. మరోవైపు, కేరళలో ఇప్పటి వరకు ముగ్గురు మంకీపాక్స్ వైరస్ బారినపడ్డారు.