Parveen Kaswan IFS: టైగర్ వస్తోంది.. కాస్త ఆగండి!.. ఆకట్టుకుంటోన్న వీడియో ఇదిగో!
- పులి రాకను గమనించి ఆగిన ట్రాఫిక్
- దర్జాగా రోడ్డు దాటి వెళ్లిపోయిన పులి
- వీడియోను పోస్ట్ చేసిన ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కస్వాన్
చూడటానికి అదో జాతీయ రహదారిలాగే కనిపిస్తోంది. డబుల్ లేన్‌తో ఉన్న ఆ రోడ్డు ఓ దట్టమైన అటవీ ప్రాంతం మీదుగా వెళుతోంది. ట్రాఫిక్ మామూలుగానే కదులుతున్నా...ఉన్నట్టుండి రెండు వైపులా వాహనాలు ఆగిపోయాయి. మధ్యలో 150 నుంచి 250 మీటర్ల దూరంలో ఎలాంటి వాహనాలు లేవు. అల్లంత దూరాన అటు వైపు నుంచి వాహనాలు ఆగితే... ఇటువైపున వాహనాలను నిలిపివేస్తూ ఇద్దరు వ్యక్తులు ఏకంగా ట్రాఫిక్ పోలీసుల అవతారం ఎత్తారు. ఇదంతా ఎందుకో తెలుసా?
అటువైపుగా ఓ టైగర్ వస్తోందట. పులి వస్తున్న విషయాన్ని ఎలా గ్రహించారో తెలియదు గానీ... ఆ రోడ్డు వెంట సాగే వాహనదారులు ఎక్కడికక్కడే ఆగిపోయారు. వాహనాలన్నీ ఆగిపోయాక.. చిన్నగా అడుగులో అడుగు వేసుకుంటూ దర్జా ఒలకబోస్తూ అలా..అలా.. రోడ్డు దాటిపోయింది. ఈ దృశ్యం ఎక్కడిదో గానీ... సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌కు చెందిన ప్రవీణ్ కస్వాన్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.