Shiv Sena: శివసేన ఎవరి సొంతం కాబోతోంది?.. ఈసీ తాజా అడుగుతో మహారాష్ట్రలో పెరిగిన ఉత్కంఠ!
- శివసేన తమదే అంటున్న థాకరే, షిండే
- మెజార్టీని నిరూపించుకునేందుకు డాక్యుమెంట్లను ఇవ్వాలన్న ఈసీ
- డాక్యుమెంట్లు అందిన తర్వాత వాదనలు వింటామన్న ఈసీ
శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేపై తిరుగుబాటు చేసిన ఆ పార్టీ నేత ఏక్ నాథ్ షిండే... ఏకంగా ఆ పార్టీని చీల్చేశారు. బీజేపీ అండతో సీఎం పీఠాన్ని అధిరోహించారు. అంతేకాదు, వివిధ మున్సిపల్ కార్పొరేషన్లలోని శివసేన కార్పొరేటర్లను తన గూటికి చేర్చుకుంటున్నారు. దీనికితోడు, శివసేన ఎంపీలు సైతం ఆయనకు టచ్ లో ఉండటం గమనార్హం.
డాక్యుమెంట్లు పంపమన్న ఈసీ
ఈ క్రమంలో... శివసేన పార్టీ తమదేనని షిండే క్లెయిమ్ చేసుకుంటున్నారు. థాకరే తో ఉన్న ఎమ్మెల్యేల కంటే తన వద్దే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నానని... ఈ నేపథ్యంలో పార్టీ అధినేతగా థాకరేని తొలగించి, తనను నాయకుడిగా గుర్తించాలని ఆయన అంటున్నారు. ఇదే విషయాన్ని ఈసీ దృష్టికి కూడా తీసుకెళ్లారు.
ఈ అంశంపై ఎన్నికల కమిషన్ స్పందించింది. మెజార్టీని నిరూపించుకునేందుకు అవసరమైన డాక్యుమెంట్లను ఆగస్ట్ 8 లోగా తమకు అందజేయాలని ఇరు పక్షాలను ఈసీ కోరింది. డాక్యుమెంట్లు అందిన తర్వాత ఈ అంశంపై విచారణ జరుపుతామని చెప్పారు. ఈసీ సూచనల మేరకు ఇరు పక్షాలు తమ స్టేట్మెంట్లను రాతపూర్వకంగా ఇవ్వాల్సి ఉంటుంది.
ఇరు పక్షాలకు ఈసీ ఇచ్చిన నోటీసులో ఏముందంటే..
'శివసేనలో చీలిక వచ్చిందనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఒక గ్రూపుకు షిండే, మరో గ్రూపుకు థాకరే నాయకత్వం వహిస్తున్నారు. వీరిద్దరూ ఒరిజినల్ శివసేన తమదే అని, తామే శివసేన అధినేతలమని చెపుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు రాతపూర్వకంగా వివరాలు ఇవ్వాలని ఇరు పక్షాలను కోరుతున్నాం. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లు, రాతపూర్వక స్టేట్మెంట్లు అందిన తర్వాత ఇరు పక్షాల వాదనలను వింటాం' అంటూ నోటీసులో ఈసీ పేర్కొంది.
మరోవైపు, శివసేన తరపున గెలిచిన 55 మంది ఎమ్మెల్యేలలో 40 మంది... 18 మంది లోక్ సభ ఎమ్మెల్యేలలో 12 మంది తనతో ఉన్నారని ఈసీకి రాసిన లేఖలో షిండే పేర్కొన్నారు.