vaccine: వ్యాక్సినేషన్ 200 కోట్ల డోసులు దాటినా... సింగిల్ డోస్ కూడా తీసుకోని వారు 4 కోట్ల పైమాటే
- 98 శాతం మందికి కనీసం ఒక్క డోస్ అయినా వ్యాక్సిన్ పంపిణీ
- 90 శాతం మందికి రెండు డోసులూ పూర్తి
- పార్లమెంటుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడి
కరోనా వైరస్ నుంచి రక్షణ కోసం ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉవ్వెత్తున కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక వ్యాక్సిన్‌లను అందరికంటే ముందు ఆవిష్కరించిన భారత్‌లో అయితే వ్యాక్సినేషన్ ఓ ఉద్యమంలా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే దేశంలో 200 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ పూర్తి చేసుకుని రికార్డు నమోదు చేసింది. దేశంలో 120 కోట్ల మంది జనాభా ఉన్నారనుకుంటే... వారిలో వ్యాక్సిన్ అవసరం లేని వారిని మినహాయించినా... 110 కోట్ల మంది దాకా వ్యాక్సిన్ పంపిణీ కావాల్సి ఉంది.
అయితే దేశంలో 200 కోట్ల మార్కు వ్యాక్సినేషన్ పూర్తయినా... దేశంలో ఇంకా సింగిల్ డోస్ వ్యాక్సిన్ కూడా తీసుకోని వారు ఎంతలేదన్నా 4 కోట్ల కంటే పైబడే ఉన్నారట. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ శుక్రవారం పార్లమెంటుకు అందజేసిన లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు. దేశంలోని వయోజనుల్లో 98 శాతం మంది కనీసం ఒక్క డోస్ అయినా వ్యాక్సిన్ తీసుకున్నారని, వీరిలో 90 శాతం మంది పూర్తిగా రెండు డోసులను కూడా తీసుకున్నారని ఆమె తెలిపారు. అయితే 4 కోట్ల మంది దాకా ఇంకా వ్యాక్సినేషన్ కేంద్రాలకు రాలేదని మంత్రి తెలిపారు.