Vijay Kumar: హైదరాబాదులో నకిలీ డాక్టర్ గుట్టురట్టు

Hyderabad police arrests fake doctor

  • పోలీసుల అదుపులో విజయ్ కుమార్
  • రష్యాలో వైద్య విద్య చదివినట్టుగా ఫేక్ డిగ్రీ
  • రూ.6.5 లక్షలతో నకిలీ పట్టా కొనుగోలు చేసిన వైనం
  • హైదరాబాదులో పలు ఆసుపత్రుల్లో వైద్యుడిగా చలామణీ

గతంలో కాంపౌండర్ గా పనిచేసిన వ్యక్తి కాలక్రమంలో డాక్టర్ అవతారం ఎత్తిన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. తాజాగా ఈ నకిలీ డాక్టర్ గుట్టురట్టయింది. అతడి పేరు కె.విజయ్ కుమార్. 36 ఏళ్ల విజయ్ కుమార్ హైదరాబాదులోని కర్మాన్ ఘాట్ లో ఆర్కే హాస్పిటల్ డాక్టర్ గా చలామణీ అవుతున్నాడు. ఈ ఆసుపత్రిలో నైట్ రౌండ్స్ తిరుగుతూ, పగలు ఇతర డాక్టర్లు చికిత్స చేసిన పేషెంట్లను రాత్రివేళ పర్యవేక్షిస్తుంటాడు. 

అయితే, అతడి గురించి కీలక సమాచారం అందడంతో ఎల్బీ నగర్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ పోలీసులు, మీర్ పేట్ పోలీసులు సంయుక్తంగా అతడిని అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. విజయ్ కుమార్ గతంలో పలు ఆసుపత్రుల్లో కాంపౌండర్ గానూ, పీఆర్వో గానూ పనిచేశాడు. ఆ తర్వాత ఓ నకిలీ సర్టిఫికెట్ సంపాదించి దానిసాయంతో డాక్టర్ నంటూ పలుచోట్ల పనిచేశాడు. 

2020-21లో ఉప్పల్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో డాక్టర్ నని చెప్పుకుని నెలకు రూ.60 వేల జీతంతో ఆర్నెల్లు పనిచేశాడు. అక్కడ మానేసిన తర్వాత కొన్నినెలల విరామం అనంతరం కర్మాన్ ఘాట్ లోని ఆర్కే ఆసుపత్రిలో డాక్టర్ గా చేరాడు. ఈ ఆసుపత్రిలో నెలకు రూ.45 వేల వేతనం అందుకునేవాడు. 

రష్యాలోని ఖజాన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ నుంచి వైద్య విద్య అభ్యసించినట్టుగా ఓ ఫేక్ సర్టిఫికెట్ ను రూ.6.5 లక్షలతో కొనుగోలు చేశాడని పోలీసులు తెలిపారు. 

విజయ్ కుమార్ స్వస్థలం హుజూర్ నగర్. రెండేళ్ల కిందట దిల్ సుఖ్ నగర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేసే సమయంలో అఫ్రోజ్ (సీటీ స్కాన్ టెక్నీషియన్) అనే వ్యక్తిని కలవగా, అతడి ద్వారా జునైద్ అనే కంప్యూటర్ ఆపరేటర్ పరిచయం అయ్యాడు. జునైద్ ద్వారా నకిలీ వైద్య విద్య పట్టా పొందాడు. పాస్ పోర్టుపై రష్యన్ ఇమ్మిగ్రేషన్ స్టాంపు కూడా వేయిస్తానని జునైద్ అతడికి హామీ ఇచ్చినా, ఇంతవరకు అది జరగలేదు. కాగా, విజయ్ కుమార్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు అఫ్రోజ్, జునైద్ లను కూడా అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News