USA: అమెరికాలో మళ్లీ వెలుగు చూసిన పోలియో కేసు.. 2013 తర్వాత తొలిసారి గుర్తింపు
- పోలియో టీకాలోని బలహీన వైరస్సే కారణమంటున్న పరిశోధకులు
- 2000వ సంవత్సరంలోనే నోటి చుక్కల టీకాను నిలిపివేసిన అమెరికా
- ప్రస్తుతం ఇంజక్షన్ రూపంలో టీకా
అంతరించి పోయిందనుకుంటున్న పోలియో మహమ్మారి కేసులు మళ్లీ అడపాదడపా బయటపడుతున్నాయి. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 13 కేసులు వెలుగుచూశాయి. తాజాగా అమెరికాలోని న్యూయార్క్‌లో ఓ కేసు బయటపడింది. అక్కడ ఓ వ్యక్తిలో పోలియోను గుర్తించినట్టు వైద్యాధికారులు తెలిపారు. పోలియో చుక్కల టీకాలో ఉండే బలహీన వైరస్ నుంచి అతడికి పోలియో సోకినట్టు తమ అధ్యయనంలో తేలిందన్నారు.
పోలియో నివారణకు వేసే చుక్కల మందు టీకాను 2000వ సంవత్సరంలోనే అమెరికా నిలిపివేసింది. ప్రస్తుతం ఇంజెక్షన్ ద్వారా టీకాలు వేస్తున్నారు. ఇంజక్షన్ ద్వారా ఇచ్చే టీకాలో మృత వైరస్ ఉంటుంది. అదే చుక్కల టీకాలో అత్యంత బలహీనమైన పోలియో వైరస్ ఉంటుందని పరిశోధకులు తెలిపారు. బలహీన వైరస్‌ను పంపడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి పోలియో వైరస్‌ను గుర్తుపడుతుంది. భవిష్యత్తులో శక్తిమంతమైన వైరస్ వచ్చినప్పుడు దానితో పోరాడుతుంది. అయితే, తాజాగా వెలుగు చూసిన కేసులో బాధితుడు పోలియో బారినపడడానికి ఈ బలహీన వైరస్సే కారణమని పేర్కొన్నారు.