Chandrababu: అందుకే ఎటపాక మండల ప్రజలు తమను తెలంగాణలో కలపాలంటున్నారు: చంద్రబాబు
- గోదావరి వరదలపై చంద్రబాబు స్పందన
- బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని వెల్లడి
- ఇప్పటికీ కరెంట్, రాకపోకలు పునరుద్ధరించలేదని విమర్శలు
- ఎదురుదాడి మాని బాధితులను ఆదుకోవాలని హితవు
గోదావరి వరద బాధితులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో గోదావరి వరదలతో ప్రజలు గత రెండు వారాలుగా నరకం చవిచూస్తున్నారని వెల్లడించారు. విలీన మండలాల్లో 14 రోజులుగా విద్యుత్ సరఫరా లేక ఆయా గ్రామాల ప్రజలు పడుతున్న బాధలు అత్యంత దారుణం అని పేర్కొన్నారు.
కరెంట్ రాకపోవడంతో తాగునీరు, ఇళ్లు శుభ్రపరుచుకోవడానికి నీరు కూడా లేని దుర్భర పరిస్థితుల్లో వారు ఉన్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వరద బురదను, కూలిన చెట్లను తొలగించి రోడ్లపై రాకపోకలు పునరుద్ధరించడం కోసం ప్రభుత్వం నుంచి కనీస ప్రయత్నం కూడా జరగడంలేదని ఆరోపించారు. వారం కిందటే వరదలు తగ్గాయి అని ప్రకటనలు చేసిన మంత్రులు ఇప్పటికీ విద్యుత్ సరఫరాను, రాకపోకలను ఎందుకు పునరుద్ధరించలేదో చెప్పాలని చంద్రబాబు నిలదీశారు.
జగన్ సర్కారు నుంచి వరద బాధితులకు కనీస సాయం అందకపోవడం వల్లనే ఎటపాక మండలం ప్రజలు తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారని వివరించారు. తమను పొరుగు రాష్ట్రంలో కలపాలని ప్రజలు అడుగుతున్నారంటే ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయారని అర్థం అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ పరిస్థితికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని పేర్కొన్నారు.
ప్రతిపక్షం అడిగే ప్రశ్నలపై ఎదురుదాడి చేయడం మాని ప్రజల వద్దకు వెళితే వాస్తవాలు తెలుస్తాయని చంద్రబాబు హితవు పలికారు. వరదకు చనిపోయిన పశువుల కళేబరాలతో, ఇళ్లలో విషసర్పాలతో, దోమలు, పరుగులతో నిద్రాహారాలు లేకుండా గడుపుతున్న బాధిత ప్రజల వేదన తెలుసుకోండని సూచించారు. ప్రభుత్వ పెద్దలు గాల్లో పర్యటనలు, గాలి మాటలు పక్కనబెట్టి యుద్ధ ప్రాతిపదికన వరద ప్రాంతాల సమస్యలు పరిష్కరించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.