India: సరిహద్దుల్లో మరోసారి చైనా యుద్ధ విమానాల కవ్వింపులు

China jet fighter provokes at LAC again

  • తరచుగా ఎల్ఏసీ వద్దకు వస్తున్న చైనా ఫైటర్ జెట్లు
  • స్పందించిన భారత వాయుసేన
  • సరిహద్దుల వద్ద మిగ్-29, మిరేజ్ విమానాల మోహరింపు
  • చైనాకు బుద్ధి చెప్పేందుకు గట్టి చర్యలు

ఇటీవల కాలంలో చైనా యుద్ధ విమానాలు తరచుగా భారత సరిహద్దులకు సమీపంలోకి వస్తున్నాయి. ఇరుదేశాల సైనికుల మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించేందుకు భారత్, చైనా కమాండర్ స్థాయి చర్చలు జరిపాయి. అయినప్పటికీ, చైనా వైపు నుంచి కవ్వింపు చర్యలు ఆగడంలేదు. మరోసారి చైనా యుద్ధ విమానాలు వాస్తవాధీన రేఖకు చేరువలోకి దూసుకొచ్చాయి. 

గత మూడు నాలుగు వారాల నుంచి చైనా ఫైటర్ జెట్లు భారత ఎల్ఏసీ సమీపంలోకి రావడం నిత్యకృత్యమైంది. అవి భారత రక్షణ వ్యవస్థలను గమనించడానికి చైనా వాయుసేన చేస్తున్న ప్రయత్నాలని భావిస్తున్నారు. 

దీనిపై ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. తరచుగా సరిహద్దుల్లోకి వస్తున్న చైనా విమానాల్లో అత్యాధునిక జే-11 యుద్ధ విమానాలు కూడా ఉన్నాయని, పరస్పర నమ్మకం కోసం ఏర్పాటైన 10 కిలోమీటర్ల సీబీఎం (కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్) రేఖను కూడా చైనా విమానాలు ఉల్లంఘిస్తున్నాయని వివరించాయి. 

కాగా, చైనా దుందుడుకు చర్యలను తిప్పికొట్టేందుకు భారత వాయుసేన సంసిద్ధమైంది. పర్వత ప్రాంతాల్లో సమర్థవంతమైన మిగ్-29, మిరేజ్-2000 యుద్ధ విమానాలను సరిహద్దుల్లో మోహరిస్తోంది. చైనా విమానాలు గీత దాటితే ఈ యుద్ధ విమానాలు నిమిషాల్లోనే సరిహద్దుల వద్దకు చేరుకునేలా, ఎల్ఏసీ సమీపంలోని తన స్థావరాలకు వీటిని తరలిస్తోంది.

  • Loading...

More Telugu News