Kerala high court: సర్టిఫికెట్లలో తల్లి పేరు ఒక్కటే.. కేరళ హైకోర్టు అనుమతి
- అవివాహిత మహిళకు జన్మించిన వ్యక్తికి ఊరట
- తన సర్టిఫికెట్లలో తండ్రి పేరు తొలగించేందుకు అనుమతి కోరిన వ్యక్తి
- కేవలం తల్లి పేరు నమోదుకే అవకాశం కల్పించాలని వినతి
వివాహం కాకుండానే మహిళకు జన్మించిన పిల్లల సర్టిఫికెట్ల విషయంలో కేరళ హైకోర్టు ఓ ప్రత్యేక తీర్పునిచ్చింది. తన జన్మ ధ్రువపత్రం, గుర్తింపు పత్రం, ఇతర డాక్యుమెంట్లలో తల్లి పేరును మాత్రమే చేర్చుకునేందుకు ఓ వ్యక్తికి అనుమతించింది. అవివాహిత మహిళలు, అత్యాచార బాధిత మహిళలకు జన్మించిన పిల్లలు ఈ దేశంలో ప్రాథమిక హక్కులైన గోప్యత, స్వేచ్ఛ, గౌరవంతో జీవించొచ్చని పేర్కొంది.
వివాహం చేసుకోని ఓ మహిళకు జన్మించిన వ్యక్తి సైతం ఈ దేశ పౌరుడు/పౌరురాలిగా పేర్కొంటూ.. వారి ప్రాథమిక హక్కులకు ఎవరూ భంగం కలిగించలేరని జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ తీర్పు సందర్భంగా పేర్కొన్నారు. తన సర్టిఫికెట్లలో తండ్రి పేరు ఉండడం, అది కూడా మూడు రకాలుగా ఉండడంతో ఓ వ్యక్తి కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. తన సర్టిఫికెట్లలో తండ్రి పేరును తొలగించి, కేవలం తల్లిపేరే నమోదు చేయడానికి (ఆమెకు వివాహం కాలేదు) అవకాశం కల్పించాలని కోరాడు.
దీంతో కోర్టు అతడికి అనుకూలంగా తీర్పును జారీ చేసింది. పౌరులు అందరినీ ప్రభుత్వం ఒకే మాదిరిగా చూడాలని పేర్కొంది. సర్టిఫికెట్ లో తండ్రి పేరును తొలగించాలని రిజిస్ట్రార్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ ను, బోర్డు ఆఫ్ హయ్యర్ సెకండరీ ఎగ్జామినేషన్స్, యూఐడీఏఐ, పాస్ పోర్ట్ ఇలా వివిధ విభాగాలకు సైతం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.